విద్యార్థినిని ప్రేమలోకి దింపిన టీచర్.. ఆపై షాకింగ్ ఘటన
మన దేశ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవం పొందిన వ్యక్తి ఉపాధ్యాయుడు.

మన దేశ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవం పొందిన వ్యక్తి ఉపాధ్యాయుడు. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా భావిస్తూ గురు- శిష్య బంధాన్ని అత్యంత పవిత్రమైనదిగా మన సమాజం కీర్తించింది. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యతను భుజాలపై మోసే గురువులే విద్యార్థుల జీవితాలకు దిక్సూచి అవుతారని నమ్మకం. అయితే వేగంగా మారుతున్న సమాజంలో ఈ పవిత్ర బంధమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. గురువు స్థానంలో ఉండాల్సిన వారు తమ బాధ్యతను మరిచి తప్పుదోవ పట్టడం ఆందోళన కలిగించే పరిణామంగా మారుతోంది.
భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు తమ వృత్తి విలువలను విస్మరించి కీచకుల్లా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కన్నబిడ్డల మాదిరిగా ప్రేమతో కాపాడాల్సిన విద్యార్థులతోనే ప్రేమాయణాలు నడిపిస్తూ, చట్టాన్ని, నైతికతను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. విద్యాలయాలు భద్రతకు ప్రతీకలుగా ఉండాల్సిన వేళ, అక్కడే విద్యార్థులు ప్రమాదంలో పడుతున్న పరిస్థితులు కలవరపెడుతున్నాయి.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం డివిజన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన ఈ దిగజారుతున్న పరిస్థితికి ఉదాహరణగా నిలిచింది. ఆ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పర్రే మైటీన్ పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని ప్రేమలోకి లాగాడు. కొంతకాలం పాటు రహస్యంగా కొనసాగిన ఈ వ్యవహారం చివరికి రహస్య వివాహం, రహస్య కాపురం వరకు వెళ్లింది. బాలిక మెడలో పసుపు తాడు గమనించిన స్నేహితులు ప్రశ్నించగా, ఏదో మొక్కు కోసం కట్టుకున్నానని ఆమె చెప్పి తప్పించుకుంది.
అయితే కూతురు మెడలో పసుపు తాడు చూసిన తల్లికి అనుమానం రావడంతో గట్టిగా నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని ప్రశ్నించినప్పటికీ, ఆ విషయంపై ప్రిన్సిపల్‌కు కూడా ముందుగా సమాచారం లేదని తేలింది. అంతేకాదు, తప్పు జరిగిందని పాఠశాల యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మైనర్ బాలికను వివాహం చేసుకొని శారీరక సంబంధం పెట్టుకున్నందుకు పొక్సో చట్టం కింద పర్రే మైటీన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సిన పాఠశాల యాజమాన్యంపై కూడా వేరే కేసులు నమోదు చేశారు.
మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం, బలహీనమైన కుటుంబ పర్యవేక్షణ, సినిమాలు చూపించే వక్రీకృత సంబంధాలు వంటి ఎన్నో అంశాలు పిల్లల మనసులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావాల నుంచి పిల్లలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు, సమాజానికి పెద్ద అగ్నిపరీక్షగా మారిందన్న వాస్తవం ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది.
ALSO READ: భార్య కోసం ప్రతి ఏడాది 3 కిలోల బంగారం కొనుగోలు









