Tuesday, March 24, 2026
Homeఅంతర్జాతీయంUS-India Trade Agreement: అమెరికా టారిఫ్ కట్.. మరో వారంలో అమల్లోకి!

US-India Trade Agreement: అమెరికా టారిఫ్ కట్.. మరో వారంలో అమల్లోకి!

Tariff Cuts on Indian Exports Under US-India Trade Deal: భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలిదశ సిద్ధమైంది. నాలుగైదు రోజుల్లో సంతకాలు జరిగి, సంయుక్త ప్రకటన వెలువడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. తర్వాతి ఒకటి రెండు రోజుల్లోనే భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్ధ ఒప్పందాన్ని సిద్ధం చేయడానికి నెలా, నెలన్నర రోజులు పట్టవచ్చని.. మార్చి మధ్య నాటికి దానిపై సంతకాలు పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత అమెరికా ఉత్పత్తులపై భారత్‌లో సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్ధ ఒప్పందం తర్వాత భారత్‌కు మరిన్ని మినహాయింపులు దక్కుతాయని, అందువల్ల ఒప్పందం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

రూ.45 లక్షల కోట్ల దిగుమతులకు అంగీకారం

అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల (500 బిలియన్‌ డాలర్ల) దిగుమతులకు అంగీకరించిన అంశంపై పీయూష్‌ గోయల్‌ కీలక విషయాలు వెల్లడించారు. ‘‘వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌కు భారీగా చమురు, డేటా సెంటర్లు, సమాచార రంగ పరికరాలు అవసరం. దానికి అదనంగా మన దేశానికి అవసరమైన విమానాల కోసం ఇప్పటికే చేసిన, ఇకపై చేయబోయే ఆర్డర్ల విలువే రూ.7.2 లక్షల కోట్ల (80 బిలియన్‌ డాలర్లు)కుపైగా ఉంటుంది. ఇక పాతవాటికి అవసరమైన ఇంజన్లు, విడిభాగాల ఖర్చును కలిపితే ఇది రూ.9లక్షల కోట్లు (100 బిలియన్లు) దాటుతుంది. భారత్‌ డేటా సెంటర్ల ఏర్పాటుకు ట్యాక్స్‌ హాలిడే ఇచ్చింది. దీనితో రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.13.5 లక్షల కోట్ల మేర డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు వస్తే.. వాటికి సంబంధించిన పరికరాలను అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటాం. ఇలాంటివన్నీ లెక్కిస్తే రూ.45 లక్షల కోట్ల దిగుమతులు పెద్ద విషయమేమీ కాదు..’’ అని చెప్పుకొచ్చారు.

మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ గా భారత్!

అమెరికాలో భారత్‌ పెట్టుబడులు పెట్టాలన్న అంశమేదీ వాణిజ్య ఒప్పందంలో లేదని స్పష్టం చేశారు. ఇక వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ ఈ డీల్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. అమెరికాలో కేవలం ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేస్తే చాలు సుంకాల్లో మార్పులు అమల్లోకి వస్తాయని.. కానీ భారత్‌ చట్టాల ప్రకారం సన్నిహిత మిత్రదేశం హోదా కల్పించి, పూర్తిస్థాయి చట్టబద్ధ ఒప్పందంపై సంతకాలు జరిగితేనే సుంకా ల్లో మార్పు చేయవచ్చని తెలిపారు. ఈ కారణంగానే అమెరికా సుంకాల తగ్గింపు త్వరగా అమలవుతుందని.. భారత సుంకాల తగ్గింపు కోసం సమయం పడుతుందని, దీనిని ఒప్పందంలో చేర్చామని ఆయన వివరించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments