
Afghan Women: భారీ భూకంపంతో అల్లకల్లోంగా మారిన అప్ఘానిస్తాన్ లో అంతకంటే దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మహిళలను రెస్క్యూ సిబ్బంది కాపాడటం లేదు. మహిళలను పురుషులు ముట్టుకోవద్దనే మత ఛాందసవాదంతో పెట్టిన కొన్ని నిబంధనలు మహిళల ప్రాణాలను హరిస్తున్నాయి. భారీ భూకంపంతో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న మహిళలను పురుష సహాయక సిబ్బంది రక్షించడంలేదు. తాము వారిని ముట్టుకోకూడదు కాబట్టి రక్షించ లేమని, వారిని మహిళా రెస్య్యూ సిబ్బందే కాపాడాలని వారు తప్పుకుంటున్నారు.
శిథిలాల కింద ఆర్తనాదాలు చేస్తున్న మహిళలు
అటు ఆప్ఘానిస్తాన్ లో తగినంత మంది మహిళా రెస్క్యూ సిబ్బంది లేకపోవడంతో బాధితులు నిస్సహాయంగా శిథిలాల కింద చిక్కుకుపోయి రక్షించమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఓవైపు పురుషులు, పిల్లలను కాపాడుతున్న సిబ్బంది తమను కాపాడకపోవడంతో అరిగోసపడుతున్నారు. గాయపడిన భూకంప బాధితుల చికిత్సలోనూ మహిళల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. పురుషులు, పిల్లలకు చికిత్స అందించిన తర్వాతే మహిళలకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ తీరుపై ప్రపంచ దేశాలు, స్వచ్ఛందం సంస్థలు తీవ్ర ఆగ్రహవం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాణాలు పోతుంటే కట్టుబాట్లు ఏంటని మండిపడుతున్నారు.
ఇక ఆదివారం నాడు వచ్చిన వచ్చిన వరుస భూకపంపాలతో 2,200 మంది మరణించినట్లు అప్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 3600 మంది గాయపడినట్లు తెలిపింది. రాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలంతా సజీవ సమాధి అయ్యారు. అక్కడ సరైన రెస్క్యూ సిబ్బంది లేకపోవడంతో సహాయక చర్యలు కూడా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి.