
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించిన ఓ అనూహ్య సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి వీకెండ్ సమయంలో ఎదురైన అనుభవం అభిమానుల హద్దులు దాటిన ప్రవర్తనపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు బయటకు వస్తే అభిమానులు నియంత్రణ కోల్పోతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండగా, ఇప్పుడు అదే కోవలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా చిక్కుకుంది.
వీకెండ్ కావడంతో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఇద్దరూ హైదరాబాద్ హైటెక్ సిటీలోని ప్రసిద్ధ నీలోఫర్ కేఫ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంటకు అక్కడ అనుకోని పరిస్థితి ఎదురైంది. కేఫ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అల్లు అర్జున్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. సెల్ఫీల కోసం ఎగబడటంతో పరిస్థితి అదుపు తప్పింది.
అభిమానుల ఉత్సాహం ఒక్కసారిగా గుంపుగా మారి, వారిని కారు ఎక్కనివ్వకుండా అడ్డుకున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ సమయంలో అల్లు అర్జున్ కంటే ఎక్కువగా స్నేహ రెడ్డి అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. గుంపు మధ్యలో ఇబ్బందిగా నిలిచిపోయిన ఆమె.. అభిమానుల ప్రవర్తనపై కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చివరకు అతి కష్టం మీద సెక్యూరిటీ సాయంతో ఇద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చారు.
ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానుల ప్రేమ ఒకవైపు ఉంటే, వ్యక్తిగత స్థలాన్ని గౌరవించకపోవడం మరోవైపు సమస్యగా మారుతోందని నెటిజన్లు చర్చిస్తున్నారు. ఇటీవల నిధి అగర్వాల్, సమంత, విజయ్ దళపతి వంటి సెలబ్రిటీలు కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నిధి అగర్వాల్ కారులోకి ఎక్కే వరకు అభిమానులు చుట్టుముట్టిన దృశ్యాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఇప్పుడు అదే తరహా ఘటన అల్లు అర్జున్ కుటుంబానికి జరగడంతో, సెలబ్రిటీల భద్రత, ప్రైవసీపై మరోసారి చర్చ మొదలైంది. అభిమానుల ప్రేమ సహజమే అయినా.. హద్దులు దాటితే అసౌకర్యంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అల్లు అర్జున్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. ఈ సంఘటన అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఆలోచనలకు దారి తీస్తోంది.
ALSO READ: ఈ మొక్క ఇంట్లో ఉంటే సిరిసంపదలు మీవెంటే!.. మనీ ప్లాంట్ కన్నా చాలా పవర్‌ఫుల్ తెలుసా?





