తెలంగాణ

తెలంగాణలో ఈ-గవర్నెన్స్‌కు ఎస్తోనియా సపోర్ట్

  • ఈ-గవర్నెన్స్‌, హెల్త్ డేటా డిజిటలైజేషన్‌కు తోడ్పాటు

  • మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన ఎస్తోనియా రాయబారి లూప్‌

  • ఐటీ, ఏఐ, రోబోటిక్స్‌ రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం

  • సామాన్యులకు డిజిటల్ సేవలు అందేలా కృషి

  • సెప్టెంబర్‌లో ఎస్తోనియా పర్యటనకు తెలంగాణ బృందం

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: సచివాలయంలో మంత్రి శ్రీధర్‌ బాబుతో ఎస్తోనియా దేశ రాయబారి మ్యారియే లూప్‌, వాణిజ్య ప్రతినిధులు భేటీ అయ్యారు. డిజిటల్‌ రంగంలో ఆ దేశం సాధించిన ప్రగతిని వారు వివరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ ఈ-గవర్నెన్స్‌, హెల్త్‌ కార్డుల డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటామని వెల్లడించారు. సామాన్యులకు డిజిటల్‌ సేవలు అందేలా ఐటీ, ఏఐ, రోబోటిక్స్‌ రంగాల్లో భాగస్వామ్యం అయ్యేలా చూస్తామన్నారు. తెలంగాణలో హెల్త్‌ కార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొదలైందని, ఈ విషయంలో ఎస్తోనియా సాంకేతిక సహకారం ఎంతో అవసరమన్నారు.

డ్రోన్‌ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇటీవల పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో హైదరాబాద్‌లో తయారైన డ్రోన్లు శత్రుదేశానికి భారీగా నష్టం చేకూరేలా చేశాయన్నారు. భవిష్యత్తులో జరిగే యుద్దాలన్నీ డ్రోన్లు, సైబర్‌ దాడులతోనే ఉంటాయని జోస్యం చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, బ్రాండెడ్‌ మద్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు. సైబర్‌ సెక్యూరిటీ విషయంలోనూ పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. సెప్టెంబర్‌ నెలలో ఎస్తోనియా దేశ పర్యటనకు తెలంగాణ ప్రతినిధుల బృందం వెళ్లనుందని శ్రీధర్‌బాబు తెలిపారు.

Read Also: 

 

Back to top button