జాతీయం

ఉత్తరాదిలో వరద బీభత్సం, 30 మంది మృతి

Jammu Kashmir Rains: ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్ము కాశ్మీరుకు చెందిన త్రికూట పర్వతాలపైన వెలసిన వైష్ణోదేవి అమ్మవారి ఆలయం యాత్రా మార్గంలో మంగళవారం భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 30 మంది యాత్రికులు మరణించారు. మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొంత మంది భక్తులు గల్లంతయ్యారు. ఆర్మీ, NDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.

దోడాలో క్లౌడ్ బరస్ట్, కొట్టుకుపోయిన ఇండ్లు

దోడా జిల్లాలో మంగళవారం క్లౌడ్ బరస్ట్ అయ్యింది. దీని కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 10కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కథువా, సంబా, దోడా, జమ్ము, రాంబాన్‌, కిష్టార్‌ జిల్లాలతోసహా జమ్ము ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా జమ్ము డివిజన్‌ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు మూతపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు.

ఉప్పొంగుతున్న నదులు

అటు భారీ వరదల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలీలోని బియాస్‌ నది ఉప్పొంగుతోంది. వరద ప్రవాహానికి అనేక నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దుకాణాలు, ఇళ్లు కొట్టుకుపోగా భవనాలు కూలిపోయాయి. హైవేలు కోతకు గురై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మనాలీ-లేహ్‌ హైవేపై వరద ప్రవాహానికి పలు ట్రక్కులు కొట్టుకుపోయాయి. ఆ హైవేపై ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. బియాస్‌ ఉప్పొంగుతుండటంతో పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో 30 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో 27 నుంచి 30 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల ధాటికి చాలా చోట్ల రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ లైన్లు, సెల్ ఫోన్ టవర్లు ధ్వంసం అయ్యాయి. అటు చీనాబ్, తావి నదులు ఉగ్రరూపం దాల్చాయి.

Back to top button