
Nagarjuna Sagar Gates Open: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు 4,61,639 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ 26 గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 583.70 అడుగులకు చేరింది. డ్యాంలో 293.68 టీఎంసీల నీరు ఉంది. మొత్తం 4,78,384 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
మరోవైపు గోదావరి ఉపనదులు, కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. కడెం, మంజీర, హరిద్ర, ఇంద్రావతి, మానేరు, ప్రాణహిత, కిన్నెరసాని, శబరి, సీలేరు ఉపనదులు పొంగి గోదావరిలో కలుస్తుండటంతో భద్రాచలం దగ్గర నీటిమట్టం 45.40 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సాయంత్రానికి ఇది 47 అడుగులకు పెరిగింది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. భద్రాచలం నుంచి దిగువకు 10.7లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
కాటన్ బ్యారేజీ దగ్గర 10.50 అడుగులకు నీటిమట్టం
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 10.50 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 8,78,421 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ఎగువన 32.100 మీటర్లు, దిగువన 23.520 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇక తుంగభద్ర జలాశయానికీ వరద ఉధృతి పెరుగుతుండటంతో 26 గేట్లను ఎత్తి 1.28 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగ భద్ర జలాశయాలు నిండాయి.