అంతర్జాతీయం

మధ్యాహ్నం 3 గంటలకు.. ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగనున్న శుభాన్షు!

Shubhanshu Shukla Return: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమ్మీదికి తిరుగు పయనం అయ్యారు యాక్సియం -4 మిషన్ టీమ్. సుమారు 18 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌ లో పరిశోధనలు సాగించిన ఆనంతరం కిందికి వస్తున్నారు. ఐఎస్‌ఎస్‌ నుంచి యాక్సి యం-4 మిషన్‌ అన్‌ డాకింగ్‌ ప్రక్రియ సక్సెస్ అయ్యింది. షెడ్యూల్ టైమ్ తో పోల్చితే 10 నిమిషాలు ఆలస్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి  డ్రాగన్‌ స్పేస్ క్రాఫ్ట్ విడిపోయింది. 23 గంట‌ల పాటూ ప్రయాణించిన తర్వాత ఆ డ్రాగ‌న్ స్పేస్‌ క్రాఫ్ట్ భూమి మీదకు చేరుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ (జూలై 15) మధ్యాహ్నం 3 గంటలకు వ్యోమగాములు ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో దిగనున్నారు.

వైద్యుల పర్యవేక్షణలో ఆస్ట్రోనాట్స్

భూమ్మీదికి చేరిన వెంటనే నలుగురు వ్యోమగాములను వైద్యులు  ఏడు రోజులపాటూ క్వారంటైన్‌ కు తరలించనున్నారు. జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా వారికి వైద్యుల బృందం ప్రత్యేక వైద్య సేవలు అందిస్తారు. ఇస్రోకు చెందిన ఫ్లైట్‌ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌ నెస్‌ను పర్యవేక్షించనున్నారు.

శుభాన్షు సరికొత్త అధ్యాయం!

యాక్సియం-4 మిషన్‌ లో భాగంగా శుభాన్షు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌ కు వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భార‌త వ్యోమ‌గామిగా శుభాన్షు శుక్లా రికార్డు నెలకొల్పారు. 1984లో సోవియట్‌ యూనియన్‌ కు చెందిన ఇంటర్‌ కాస్మోస్‌ మిషన్‌ లో భాగంగా భారత వ్యోమగామి రాకేశ్‌ శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. అక్కడ ఎనిమిది రోజుల పాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు గుర్తింపు పొందారు.

Read Also: డిసెంబరులో గగన్ యాన్, ఇస్రో కీలక ప్రకటన!

Back to top button