Bharat Taxi: మరో రెండు నెలల్లో భారత్‌ ట్యాక్సీ, అమిత్‌ షా కీలక ప్రకటన!

ఓలా, ఉబర్ కు ధీటుగా భారత్ ట్యాక్సీని తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మరో 2 నెలల్లో ఈ యాప్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.

Amit Shah On Bharat Taxi: ఓలా, ఉబర్‌ లాంటి ప్రైవేటు ట్యాక్సీ అగ్రిగేటర్‌ సంస్థల తరహాలో త్వరలోనే ‘భారత్‌ ట్యాక్సీ’ సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఆ సంస్థల్లో డ్రైవర్లకు కాకుండా యాజమాన్యాలకు లాభాలు వెళ్తున్నాయని, అందుకు భిన్నంగా లాభాలను మొత్తం డ్రైవర్లకే పంచే విధంగా ‘భారత్‌ ట్యాక్సీ’ని తీసుకురానున్నట్లు వివరించారు.

మరో రెండు నెలల్లో అందుబాటులోకి

వినియోగదారులకు సౌకర్యంతో పాటు డ్రైవర్లకు అదనపు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా భారత్‌ ట్యాక్సీని మరో రెండు నెలల్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి దక్కుతుందని అమిత్‌ షా చెప్పారు.

యువతకు పెద్ద మొత్తంలో ఉపాధి

హర్యానాలోని పంచకులలో జరిగిన ‘కృషక్‌ భారతి కోపరేటివ్‌ లిమిటెడ్‌’ (కేఆర్‌ఐబీహెచ్‌సీవో) కార్యక్రమంలో అమిత్‌షా ఈ మేరకు మాట్లాడారు. సహకార రంగం ద్వారా రైతులను సంపన్నులను చేయడానికి మోడీ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి కోసం రూ.80వేల కోట్లుగా ఉన్న బడ్జెట్‌ను రూ1.87లక్షల కోట్లకు పెంచామన్నారు. దీని ద్వారా దశలవారీగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి పునాది వేసినట్లు చెప్పారు.

Back to top button