
HEALTH TIP: కరోనా మహమ్మారి తర్వాత ప్రజల జీవనశైలిలో పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆహార విషయంలో చాలామంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా, వేడి వేడి తాజా వంటకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాత్రి మిగిలిపోయిన ఆహారాలు, చల్లారిన రోటీలు, కూరలు వంటి వాటిని తినేందుకు చాలామంది వెనుకంజ వేస్తున్నారు. కానీ తాజా అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సూచనలు చూస్తే.. రాత్రి చేసిన చపాతీలు ఉదయాన్నే తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
ప్రత్యేకంగా మధుమేహంతో బాధపడేవారికి చల్లారిన చపాతీలు ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాత్రి చేసిన చపాతీలు ఉదయానికి పోషకాలు కోల్పోతాయని భావన తప్పని వారు చెబుతున్నారు. వాస్తవానికి అందులోని ఫైబర్, పోషకాలు అలాగే ఉంటాయని, సరైన విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి దోహదపడతాయని సూచిస్తున్నారు. ఉదయాన్నే ఈ చపాతీలను టీతో గానీ, సలాడ్ లేదా తేలికపాటి కర్రీతో గానీ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.
హైబీపీ సమస్య ఉన్నవారు చల్లారిన చపాతీలను గోరువెచ్చని పాలల్లో 10 నిమిషాల పాటు నానబెట్టి తింటే రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణుల అభిప్రాయం. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారు రాత్రి పడుకునే ముందు చపాతీలను పాలలో నానబెట్టి ఉంచి, ఉదయాన్నే తింటే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు.
మధుమేహ రోగుల విషయంలో చల్లని చపాతీల ప్రాధాన్యత మరింత ఎక్కువ. రాత్రి చేసిన రోటీల్లో గ్లూకోజ్ శోషణ నెమ్మదిగా జరుగుతుందని, వాటిని పాలతో కలిపి తింటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదని పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల షుగర్ కంట్రోల్లో ఉండేందుకు ఇది సహాయకారిగా మారుతుంది.
పిల్లలు సన్నగా ఉండటం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలున్నప్పుడు కూడా ఈ చపాతీలు ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయాన్నే పాలలో నానబెట్టిన రోటీలను అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుందని చెబుతున్నారు. వేసవి కాలంలో చల్లటి పాలతో ఈ రోటీలను తింటే శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి, హీట్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి కూడా చల్లారిన చపాతీలు మంచి పరిష్కారమని చెబుతున్నారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఉదయాన్నే పాత రోటీని పెరుగుతో లేదా మజ్జిగతో తింటే కడుపు చల్లబడుతుందని, అసిడిటీ సమస్య దరిచేరదని నిపుణుల సూచన.
రాత్రి మిగిలిపోయిన చపాతీలను వృథా చేయకుండా సరైన విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేడి ఆహారమే ఆరోగ్యకరం అన్న అపోహను వదిలేసి, చల్లారిన రోటీలను సక్రమంగా డైట్లో చేర్చుకుంటే అనేక సమస్యలకు సహజ పరిష్కారం లభిస్తుందని వారు చెబుతున్నారు.
ALSO READ: భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు





