Rice production milestone: వరిధాన్యం ఉత్పాదనలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించింది. చైనాను అధిగమించి ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తంగా 15.01 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ ఘనత సాధించింది. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన నూతన విత్తనాలను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయాన్ని ప్రకటించారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో రూపొందించిన 25 పంటలకు సంబంధించిన 184 రకాల అధిక దిగుబడి విత్తనాలను శివరాజ్ విడుదల చేశారు. ఆహార కొరత ఉన్న స్థితి నుంచి ప్రపంచానికే ఆహారం అందించే స్థాయి వరకు దేశం ఎదిగిందని చెప్పుకొచ్చారు. ఇది భారత్ సాధించిన ఘన విజయమన్నారు.
‘‘వరి ఉత్పత్తిలో భారత్..చైనాను అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా ఎదిగింది. చైనా 14.52 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయగా, భారత్ 15.01 కోట్ల టన్నులను ఉత్పత్తి చేసింది’’ అని శివరాజ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, దేశంలో సమృద్ధిగా బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పారు.
నూతన విత్తనాలను రైతులకు అందేలా చూడండి!
నూతనంగా విడుదల చేసిన విత్తనాలను వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని శివరాజ్ సింగ్ అధికార్లను కోరారు. నూతనంగా అభివృద్ధి చేసిన విత్తనాలకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం 1969లో ప్రారంభమయిందని చెప్పారు. ఇంతవరకు 7,205 రకాల విత్తనాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. 1969 నుంచి 2014 వరకు 3,969 విత్తనాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, మోడీ ప్రభుత్వం హయాంలో 3,236 అధిక దిగుబడి విత్తనాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు వివరించారు.





