
ఒక్కసారి కళ్లుమూసుకుని ఊహించండి. చేతిలో ఫోన్ ఉంది కానీ ఛార్జర్ వైరు లేదు. ప్లగ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఫోన్‌ని టేబుల్‌పై పెట్టగానే అది తానే ఛార్జ్ అవుతోంది. ఇంటి చుట్టూ ఎక్కడా విద్యుత్ తీగలు లేవు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు కనిపించవు. అయినా కరెంట్ నిరంతరంగా అందుతోంది. ఇది కల కాదు, సైన్స్ ఫిక్షన్ కథ కూడా కాదు. శాస్త్రవేత్తలు మన భవిష్యత్తు కోసం నిజంగా తయారు చేస్తున్న ప్రపంచం ఇది.
విద్యుత్ గాలిలో ప్రయాణిస్తే ప్రపంచమే మారిపోతుంది. వైర్లు తెగిపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఉండవు. తుఫాన్లు, వర్షాలు వచ్చినా విద్యుత్ అంతరాయం ఉండదు. అడవులు, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు కూడా సులభంగా కరెంట్ చేరుతుంది. అంతరిక్షంలో సూర్యశక్తిని సేకరించి భూమికి పంపగలిగితే, మన విద్యుత్ అవసరాలన్నీ తీరిపోతాయన్న ఆశలు కూడా బలపడుతున్నాయి.
వైర్లు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్న ఆలోచన కొత్తది కాదు. చాలా దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించారు. నికోలా టెస్లా కాలం నుంచే ఈ కాన్సెప్ట్‌పై ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్లు కూడా అదే ఆలోచనకు చిన్న రూపం. ఇప్పుడు శాస్త్రవేత్తల లక్ష్యం ఒక్క ఫోన్‌కే కాదు.. ఇంట్లో ఉన్న అన్ని పరికరాలు వైర్లు లేకుండా పనిచేయాలన్నదే.
విదేశాల్లో ఇప్పటికే భూగర్భం నుంచి విద్యుత్ సరఫరా చేసే విధానం అమల్లో ఉంది. రహదారులపై తీగల గజిబిజి కనిపించదు. నగరాలు చాలా శుభ్రంగా, సురక్షితంగా ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం ఎటు చూసినా విద్యుత్ వైర్లు వేలాడుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అవే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అందుకే వైర్లు లేని విద్యుత్ వ్యవస్థ మన దేశానికి మరింత అవసరమని నిపుణులు చెబుతున్నారు.
అయితే నిజంగా వైర్లు లేకుండా విద్యుత్ సరఫరా సాధ్యమేనా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. దీనికి సమాధానం అవుననే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం దీనికి ప్రధానంగా ఉపయోగిస్తున్న విధానం ఇండక్టివ్ కప్లింగ్. ఛార్జింగ్ ప్యాడ్‌లో ఒక కాయిల్ ఉంటుంది. మొబైల్ ఫోన్‌లో మరో కాయిల్ ఉంటుంది. ప్యాడ్‌కు విద్యుత్ సరఫరా చేయగానే ఒక విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అదే గాలిలో ప్రయాణించి ఫోన్‌లోని కాయిల్‌కు చేరుతుంది. అక్కడ అది మళ్లీ విద్యుత్‌గా మారి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.
ఈ విధానం ప్రస్తుతం చాలా దగ్గర దూరంలోనే పనిచేస్తోంది. అందుకే ఫోన్‌ని ప్యాడ్‌పై పెట్టాల్సి వస్తోంది. దీనికంటే మెరుగైన విధానాన్ని రెజోనెంట్ ఇండక్టివ్ కప్లింగ్ అంటారు. ఇందులో ట్రాన్స్‌మిటర్, రిసీవర్ కాయిల్స్ రెండింటినీ ఒకే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తారు. అలా చేస్తే విద్యుత్ బదిలీ మరింత సమర్థంగా జరుగుతుంది. కొంచెం ఎక్కువ దూరం వరకు కూడా పవర్‌ను పంపే అవకాశం ఉంటుంది.
ఇదే కాదు, మైక్రోవేవ్ ట్రాన్స్‌మిషన్, రేడియో ఫ్రీక్వెన్సీ పవర్ ట్రాన్స్‌ఫర్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంట్లోకి అడుగుపెట్టగానే ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ అన్నీ ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయ్యే పరిస్థితి రావచ్చు. అంతరిక్షంలో సేకరించిన సౌరశక్తిని మైక్రోవేవ్‌ల రూపంలో భూమికి పంపే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి.
ఈ సాంకేతికత పూర్తిగా అందుబాటులోకి వస్తే విద్యుత్ రంగంలో విప్లవమే వస్తుంది. పర్యావరణానికి హాని తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా విధానమే పూర్తిగా మారిపోతుంది. అయితే భద్రత, ఆరోగ్యంపై ప్రభావాలు, ఖర్చు వంటి అంశాలపై ఇంకా పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.
వైర్లు లేని విద్యుత్ ప్రపంచం ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉన్నా.. అది మనకు చాలా దగ్గరలోనే ఉందన్నది నిజం. భవిష్యత్తులో మన పిల్లలు విద్యుత్ తీగలు ఎలా ఉండేవో కూడా తెలియని రోజులు రావొచ్చన్న ఆశ ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది.
ALSO READ: Electric Bike Fire: నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు





