Indian Basmati Rice Exports: ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పతనమవడంతోపాటు ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విధించిన ఆంక్షల ప్రభావం భారత బాస్మతి ఎగుమతులపై పడింది. ఈ నేపథ్యంలో రూ.2 వేల కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఇరాన్ పోర్టుల్లో నిలిచిపోయింది. రియాల్ విలువ పడిపోవడంతో ఇరాన్ ప్రభుత్వం ఆహార దిగుమతులపై ఇస్తున్న రాయితీని నిలిపివేసింది. ఈ ప్రభావం భారత్ నుంచి ఇరాన్‌కు ఎగుమతి అయిన బాస్మతి బియ్యంపై పడింది.
ఇరాన్ నిర్ణయం కోసం మిల్లర్ల ఎదరు చూపులు!
ముఖ్యంగా బాస్మతి బియ్య ఎగుమతి రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాకు చెందిన మిల్లర్లు ధరలు పడిపోయి, చేతిలో రూపాయి ఆడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌లో ఏర్పడిన కరెన్సీ సంక్షోభంతో అక్కడి ప్రభుత్వం రాయితీలను ఎత్తివేసింది. ముఖ్యంగా ఆహారంపై ఇస్తున్న రాయితీలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో భారత్ నుంచి వెళ్లిన ప్రీమియం బాస్మతి బియ్యం అంతర్జాతీయ ఓడరేవుల్లోనే నిలిచిపోయాయి.బాస్మతి రైస్ విషయంలో ఇరాన్ ప్రభుత్వ సానుకూల నిర్ణయం కోసం మిల్లర్లు ఎదురు చూస్తున్నారు. రియాల్ పతనంతో ఇరాన్ ప్రభుత్వం కొన్నేళ్లుగా అందిస్తున్న ఆహార సబ్సిడీని నిలిపివేసిందని.. వాణిజ్య పరంగా ఎగుమతి దారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని పంజాబ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు చెప్పారు. బాస్మతి బియ్యంతోపాటు టీ, ఔషధాల ఎగుమతులు కూడా సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు.
ప్రతి ఏటా రూ. 12 వేల కోట్ల విలువైన బాస్మతి రైస్ ఎగుమతి
భారత్ నుంచి బాస్మతి ఎగుమతి అయ్యే ముఖ్య దేశాల్లో ఇరాన్ ఒకటి. ఏటా రూ.12 వేల కోట్ల విలువైన 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి అవుతుంది. వీటిలో 40 శాతం పంజాబ్, హర్యానా నుంచే జరుగుతోంది. ప్రస్తుతం బాస్మతి బియ్యం ధరలు కిలోకు రూ.3 నుంచి రూ. 4 వరకు తగ్గుముఖం పట్టాయని, ఇది పరోక్షంగా రైతులకు కూడా తీవ్రనష్టాన్ని చేకూరుస్తోందని మిల్లర్లు చెబుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలకు ముందు డాలరుకు 90వేల రియాల్స్ ఉండగా, రాను రాను మరింత బలహీన పడి ప్రస్తుతం డాలరుకు 1,50000 రియాల్స్ చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.





