ఆంధ్ర ప్రదేశ్

సెంట్రల్ జైలుకు పోసాని కృష్ణమురళీ.. నెక్స్ట్ అతనే?

ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ మద్దతుదారుడిగా ఉంటూ టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేసిన హీరో పోసాని కృష్ణమురళీ జైలు పాలయ్యారు. పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు అంటే మార్చి 13 వరకూ పోసానికి రిమాండ్‌ విధించారు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్‌. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై ఈ నెల 24న కేసు నమోదు అయింది. దీంతో పోలీసులు బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు.

పోసానిని అరెస్ట్‌ చేసిన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు నిన్న అదేపోలీసు స్టేషన్‌లో 9 గంటలపాటు విచారించారు. అనంతరం ఆయన్ను రైల్వే కోడూరు మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్‌కు రిమాండ్‌ రిపోర్ట్‌ను సమర్పించారు. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. కాగా పోలీసుల వాదనలను పోసాని తరుపు న్యాయవాదులు వ్యతిరేకించారు. పోసాని తరుపున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. సుమారు 5 గంటలపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Back to top button