
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : లింగోజిగూడ డివిజన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 13, సరూర్‌నగర్ చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) నిషేధిత జాబితాలో ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు కొనసాగుతుండటంపై సంచలనం రేగుతోంది. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నట్టు సమాచారం.
ఈ వ్యవహారంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన చైన్‌మెన్ పై సీరియస్ ఆరోపణలు వెలువడుతున్నాయి. అక్రమ నిర్మాణ దారుడి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి, దానిలో రూ.3 లక్షలు పైకి ఇచ్చినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
విశేషంగా, ఈ ప్రాంతానికి కొత్తగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రతాప్ విధుల్లోకి వచ్చి వారం రోజులు అయినప్పటికీ, ఆయనకి ఈ వ్యవహారంపై పూర్తిగా అవగాహన లేకపోవచ్చని అధికారులు అంటున్నారు. కానీ, చైన్‌మెన్ స్థాయిలో ఈ విధమైన వసూళ్ల దందా కొనసాగడం బల్దియాపై ఉన్న అవినీతి చింతలను మరింత పెంచుతోంది.
“బల్దియా అంటేనే.. కాయా, పియా, చెల్దియా..!’’ అని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారుల దాడుల్లో కూడా ఇలాంటి కేసులు బయటపడిన తర్వాత, బాధ్యులపై ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు ఈ వ్యవహారంపై ఏసీపీ ప్రతాప్, ఏం నిర్ణయం తీసుకుంటారు..? చైన్‌మెన్ పై విచారణ జరుపుతారా..? అనే ప్రశ్నలకు సమాధానం కోసం స్థానికులు వేచి చూస్తున్నారు.