
దేశంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, స్వావలంబన దిశగా ముందుకు నడిపించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వరుసగా పథకాలను అమలు చేస్తోంది. ఆ క్రమంలోనే గత సంవత్సరం భారత జీవిత బీమా సంస్థ LIC ప్రత్యేకంగా మహిళల కోసం బీమా సఖి యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చదువు ఆగిపోయిన మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కూడా స్థిరమైన ఆదాయం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ముఖ్యంగా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన మహిళలకు ఇది ఒక సువర్ణావకాశంగా మారింది.
బీమా సఖి యోజన కింద మహిళలకు LIC ఏజెంట్లుగా మారేందుకు అవసరమైన శిక్షణను పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఈ శిక్షణ కాలంలోనే వారికి నెలవారీ స్టైపెండ్ కూడా ఇస్తారు. మొదటి సంవత్సరం నెలకు రూ. 7 వేల చొప్పున, రెండో సంవత్సరం రూ. 6 వేల చొప్పున, మూడో సంవత్సరం రూ. 5 వేల చొప్పున స్టైపెండ్ అందుతుంది. ఈ విధంగా 3 సంవత్సరాల కాలంలో స్టైపెండ్ రూపంలోనే రూ. 2 లక్షలకు పైగా ఆదాయం లభిస్తుంది. దీనికి తోడు బీమా పాలసీల విక్రయాలపై వచ్చే కమిషన్ ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.
ఈ పథకం ద్వారా రాబోయే మూడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 2 లక్షల మంది బీమా సఖిలను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు LIC ఏజెంట్లుగా పని చేస్తారు. దీని వల్ల వారు తమ ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలు పొందడమే కాకుండా, ఇతరులకు కూడా బీమా అవసరాలపై అవగాహన కల్పించే బాధ్యతను చేపడతారు. అంతేకాకుండా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలకు భవిష్యత్తులో LIC డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి.
బీమా సఖి యోజనకు అర్హత కలిగిన మహిళల వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పథకం కేవలం మహిళల కోసమే రూపొందించబడింది. ఎంపికైన మహిళలకు 3 సంవత్సరాల పాటు శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత బీమా ఏజెంట్లుగా పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. LIC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్లి బీమా సఖి యోజనకు సంబంధించిన ఆప్షన్పై క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, చిరునామా వంటి వివరాలను సరిగా నమోదు చేయాలి. LICలో ఇప్పటికే ఏజెంట్, డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా ఉద్యోగితో సంబంధం ఉంటే ఆ వివరాలను కూడా వెల్లడించాలి. చివరగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
మహిళలకు ఉద్యోగం, ఆదాయం, గౌరవం అన్నింటినీ కలిపి అందించే ఈ పథకం ద్వారా అనేక మంది మహిళలు తమ జీవితాలను కొత్త దిశలో మలచుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు బీమా సఖి యోజన ఒక పెద్ద అండగా మారనుందని విశ్లేషిస్తున్నారు.
ALSO READ: ఫస్ట్ నైట్ రోజే పారిపోయిన భర్త.. అసలు విషయం తెలిసి భార్య షాక్





