
నల్లగొండ,(క్రైమ్ మిర్రర్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి సన్నబియ్యం లబ్ధిదారు అయిన మేడి అరుణ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిందని, అయితే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే కాకుండా, ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నదని, ఉచిత బస్సు, 500 రూపాయలకే ఎల్పీజీ కనెక్షన్, గృహజ్యోతి, రైతు భరోసా, రైతుభీమా, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కింద నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇవ్వనున్నమన్నారు. సన్నబియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకమని, అలాంటిది జగ్జీవన్ రామ్ జయంతి రోజున పేద దళిత మహిళ అయిన అరుణ ఇంట్లో భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు.
Also Read : మల్లీ అదే పొరపాటు చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం..!?
నిజమైన తెలంగాణ పేదవాడు కలల కన్న తెలంగాణ ఇదేనని ఆయన తెలిపారు. ఇప్పటివరకు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని పాలిష్ చేసి తిరిగి రీసైకిలింగ్ చేసి మిల్లర్లు అమ్ముతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉగాది రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్నగర్ నుండి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. తాము 21 లక్షల మంది పేర్లను రేషన్ కార్డులలో కొత్తగా చేర్చడం జరిగిందని, మరో 21 లక్షలు చేర్చనున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హాయములో బ్రాహ్మణ వెల్లెంల పథకాన్ని మూలన పెట్టిందని, పదేళ్లలో నత్తనడకన నడిచిన బ్రాహ్మణ వెల్లెముకు 100 కోట్ల రూపాయలను కేటాయించి నీటిని తీసుకురావడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వ హాయాంలో పేదల కళ్ళలో సంతోషం కనబడుతున్నదని అన్నారు. చిన్నతనంలో తాను కూడా కింద కూర్చుని ఇలాగే భోజనం చేశానని, తమ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, కులమతాలకు అతీతంగా అందరూ మంచి చదువులు చదువుకోవాలని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Also Read : సొంతగడ్డలో కేసీఆర్ బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి దుబ్బాక ఎమ్మెల్యే జంప్?
అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. రాబోయే కాలంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను, ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్నదని, ముందుగా ఫ్లాట్లు ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తుందని, ప్లాట్లు లేని వారికి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం నిర్వహించనున్న శ్రీరామనవమి సందర్భంగా ఆయన రాష్ట్ర, జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, నార్కెట్ పల్లి తహసిల్దార్, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.