తెలంగాణ

ఆర్‌టీసీ చార్జీల పెంపుపై బిఆర్‌ఎస్ నేతల బస్సు నిరసన యాత్ర

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి అసెంబ్లీ వరకు బస్సులో ప్రయాణించి ఆందోళన

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : రాష్ట్రంలో పెరిగిన ఆర్‌టీసీ బస్సు చార్జీలకు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ పార్టీ నేతలు మంగళవారం బస్సులోనే నిరసన వ్యక్తం మంగళవారం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అసెంబ్లీ వరకు సాధారణ ప్రయాణికుల మధ్య ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రభుత్వం నిర్ణయంపై విరుచుకుపడ్డారు.

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ ఈ నిరసనలో పాల్గొన్నారు. బస్సులో ప్రయాణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్, ప్రజలపై భారమయ్యే చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.  ప్రయాణికులను అడిగి, చార్జీల పెంపుతో వారికి కలిగిన ఇబ్బందులను తెలుసుకున్నారు. పలు ప్రయాణికులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ, రోజువారీ ఉద్యోగాలకు వెళ్లే వారికీ, ఇది పెద్ద భారమవుతోంది అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి : 

ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఆర్‌టీసీ ఆర్థిక సంక్షోభాన్ని సద్దుమణిగించడానికి సాధారణ ప్రజలపై భారమేయడం సరైంది కాదు. ప్రభుత్వం వెంటనే చార్జీల పెంపును రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిలుస్తుంది. ప్రతి రంగంలో ప్రజలపై భారం పెంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఏమైనా ప్రజా వ్యతిరేక పాలన చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఎక్కువగా బస్సులపైనే ఆధారపడే కార్మికులు, సాధారణ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం బస్సు చార్జీల పెంపును సమీక్షించి, మళ్లీ పాత చార్జీలను అమలు చేయాలి అన్నారు.

నిరసన బస్సులో పలువురు ప్రయాణికులు ఎమ్మెల్యేలకు మద్దతు తెలిపారు. రోజూ ఉద్యోగాలకు వెళ్ళే వారికి చార్జీలు పెరగడం కష్టంగా మారింది. కనీసం పేదవర్గాలకు సబ్సిడీ ఇవ్వాలి అని వారు డిమాండ్ చేశారు. ఆర్‌టీసీ చార్జీల పెంపుపై బిఆర్‌ఎస్ నేతల నిరసనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా, లేక మరిన్ని ఆందోళనలకు వేదిక అవుతుందా అనే దానిపై దృష్టి నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button