తెలంగాణ

రైతులు, కూలీల అకౌంట్లలో రేపే డబ్బులు

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుల అకౌంట్లలో సోమవారం డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అంకితం చేశారు. జనవరి 26 న బ్యాంకులకు సెలవు రోజు అయినందున అర్థరాత్రి తర్వాత రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బు జమవుతుందని చెప్పారు.రాష్ట్రంలో అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజా పాలన అంటే అధికార యంత్రాంగం ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత, ప్రజా సమస్యలను పరిష్కరించి, ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించాలని సీఎం రేవంత్ అన్నారు. అందుకే అధికారులను గ్రామాలకు పంపించామన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, పేదల ఇండ్లకు ఉచిత కరెంట్, వ్యవసాయనికి ఉచిత కరెంట్, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, రైతు రుణమాఫీ, ఏ కార్యక్రమమైనా అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారని చెప్పారు.

అధికారులు వచ్చిందే మీ సమస్యలు తెలుసుకోవడానికి.. కానీ కొందరు కావాలని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారులకు పూర్తి వివరాలు ఇవ్వండి.. వాటన్నింటినీ క్రోడీకరించి సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.మార్చి 31 లోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ లో 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఇందుకు ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని చెప్పారు.

ఏటా 20 వేల కోట్ల రూపాయలతో రైతు భరోసా కింద ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూమి లేని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీనవర్గాలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కింద ఏటా 12 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం కింద దాదాపు 10 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు.

 

Back to top button