అంతర్జాతీయంజాతీయం

Sheikh Hasina: హసీనాకు ఉరిశిక్ష.. భారత్ నెక్ట్స్ స్టెప్ ఏంటంటే?

షేక్ హసీనాకు బంగ్లాదేశం ట్రిబ్యునల్ మరణశిక్ష విధించడంపై భారత్ స్పందించింది. పొరుగు దేశంతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పింది. అటు ఈ తీర్పును హసీనా ఖండించారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించింది. ప్రభుత్వంలో ఉండి ఆమె కొనసాగించిన హింసపై విచారణ జరిపి ఈ తీర్పును ప్రకటించింది. తీర్పు అనంతరం భారత్ స్పందించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపింది. ఇందుకోసం సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది.

హసీనా విషయంలో ట్రిబ్యునల్ ఏం చెప్పింది?  

బంగ్లాదేశ్ లో నిరంకుశంగా షేక్ హసీనా నేరాలకు పాల్పడినట్టు ఐసీటీ తేల్చింది. ఈ నేరాలకు గాను ఆమెకు  మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయవాదులు తెలిపారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. హసీనాతో పాటు మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్, మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్‌ మామూన్‌కు కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.

తీర్పును ఖండించిన హసీనా

అటు ఈ తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్షపడేలా చేసిందన్నారు. కోర్టులో తన వాదన వినిపించే సరైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవహక్కుల పట్ల తమకు శ్రద్ధ ఉన్నందువల్లే మయనార్మ్ హింసతో బంగ్లాకు పారిపోయి వచ్చిన లక్షలాది మంది శరణార్ధులకు ఆశ్రయమిచ్చామని చెప్పారు. మరోవైపు హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లా విదేశాంగ శాఖ భారత్‌కు లేఖ రాసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఆశ్రయం కల్పించడం దౌత్యపరంగా సరైనవి కావని, న్యాయం పట్ల నిర్లక్ష్యమే అవుతుందని తెలిపింది. ఈ లేఖపై భారత్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయం హసీనా భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

 

Back to top button