జాతీయం

Dense Fog: ఒకేసారి 20 వాహనాలు ఢీ.. నలుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు!

నార్త్ లో పొగమంచు కమ్మేసింది. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది. వాహనాల మధ్య విజుబులిటీ తగ్గి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Delhi-Mumbai expressway Accident: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకుంటుంది. ఫలితంగా రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.    ప్రతికూల వాతావరణానికి, మితిమీరిన వేగం తోడవుతుండటంతో తారు రోడ్లపై నెత్తురు చిందుతోంది. పొగమంచుతో వాయు రవాణాపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలాచోట్ల విమానాలు రద్దవుతున్నాయి. కొన్ని విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి.

20 వాహనాలు ఢీ, నలుగురు మృతి

హరియాణా రోహ్‌తక్‌ లోని మెహం ప్రాంతంలో పొగమంచు కారణంగా ఒకేచోట 35-40 వాహనాలు ఢీకొన్న ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన జరిగింది.  హరియాణాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో నూహ్‌ పట్టణం వద్ద ఒకేచోట 20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. 15-20 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో తెల్లవారుజామున 5గంటలకు తొలుత.. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న లారీ, మరో లారీని ఢీకొట్టింది. ఆ వెంటనే.. జామకాయల లోడ్‌తో దూసుకొచ్చిన ఓ ట్రక్కు, ఆ లారీలను ఢీకొట్టి పల్టీకొట్టింది. ఆ వెంటనే పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో కార్లు, టెంపోలు వచ్చి ఢీకొన్ని నుజ్జునుజ్జయ్యాయి. ఈ తరహా ప్రమాదాలే హిస్సార్‌, రెవారీలోనూ జరిగాయి. సోనిపత్‌ వద్ద ముందు వెళుతున్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న మహిళా పోలీసు అధికారి మృతిచెందారు.

61 విమానాలు రద్దు

ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా  61 విమానాలు రద్దయ్యాయి. మరో ఐదు విమానాలను దారి మళ్లించారు. 250కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని దాదాపు అన్ని విమానాశ్రయాల్లోనూ  ఇదే పరిస్థితి నెలకొందని ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. దట్టమైన పొగమంచు ప్రభావం ప్రధాని మోడీ, సాకర్‌ దిగ్గజం మెస్సీ ప్రయాణాలపైనా పడింది. జోర్దాన్‌, ఇథియోపియా, ఒమన్‌ దేశాల్లో పర్యటించేందుకు మోడీ సోమవారం ఉదయం 8:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరాల్సి ఉంది. అయితే పొగమంచు కారణంగా మోదీ గంట ఆలస్యంగా అంటే 9:30కు బయలుదేరాల్సి వచ్చింది. భారత పర్యటనలో ఉన్న మెస్సీ, షెడ్యూల్‌ ప్రకారం ముంబై నుంచి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా మెస్పీ ప్రయాణం ఆలస్యమైంది.

Back to top button