Supreme Court: ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్‌, షర్జీల్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు!

సీఏఏను నిరసిస్తూ ఐదేళ్ల కిందట ఢిల్లీలో సంభవించిన అల్లర్లు, హింసాకాండకు సంబంధించిన కుట్ర కేసులో ఉమర్‌, షర్జీల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.

Delhi Riots Case: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 5 సంవత్సరాల క్రితం ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగాయి. హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ హింసాకాండకు సంబంధించిన కుట్ర కేసులో నిందితులైన ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వారు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ కేసులో మిగతా ఐదుగురికి బెయిల్‌ మంజూరుచేసింది. ఈ మేరకు జస్టిస్‌ అరవింద్‌కుమార్‌, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

అసలు ఏం జరిగిందంటే?

సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు 2020 ఫిబ్రవరి నెలాఖరులో ఈశాన్య ఢిల్లీలో హింసాత్మకంగా మారాయి. ఈ సందర్భంగా 53 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికిపైగా గాయపడ్డారు. నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యతిరేక చట్టం (యూఏపీఏ) కింద ఢిల్లీ పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ వ్యవహారంలో నిందితులందరినీ ఒకేగాటన కట్టలేమని.. ఒక్కొక్కరూ వేర్వేరు పాత్రలు పోషించారని ధర్మాసనం తెలిపింది. ఈ హింసాకాండలో ఇతర నిందితులతో పోలిస్తే ఉమర్‌, షర్జీల్‌ కీలకమైన, నిర్మాణాత్మక పాత్ర పోషించారని అభిప్రాయపడింది. అందుకే గుల్‌ఫిషా ఫాతిమా, మీరన్‌ హైదర్‌, షిఫాయుర్‌ రెహ్మాన్‌, మొహ్మద్‌ సలీం ఖాన్‌, షాదాబ్‌ అహ్మద్‌లకు బెయిల్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. సాక్షుల విచారణ పూర్తయ్యాక.. లేదంటే ఏడాది తర్వాత బెయిల్‌ కోసం కీలక నిందితులైన ఉమర్‌, షర్జీల్‌ కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

వీరిద్దరి ప్రణాళిక ప్రకారమే అల్లర్లు

స్థానికంగా జరిగే దాడులకు మించి వీరిద్దరూ ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా జనసమీకరణ చేయడం.. అల్లర్లకు వ్యూహాత్మక నిర్దేశం చేయడం వంటి కీలక పాత్ర పోషించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నట్లు ప్రాసిక్యూషన్‌ తేల్చిందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇదే సమయంలో బెయిల్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. ఆ ఐదుగురికీ 11 షరతులతో బెయిల్‌ మంజూరుచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button