అంతర్జాతీయంవైరల్

అమెరికాలో ప్రసవ ఖర్చు ఇన్ని లక్షలా? ఈ లెక్కన మన దేశంలో చాలా తక్కువే

అమెరికాలో వైద్య సేవలు ఎంత ఖరీదైనవో మరోసారి వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అక్కడ ప్రసవ ఖర్చులు సామాన్యుల్ని వణికిస్తున్నాయి.

అమెరికాలో వైద్య సేవలు ఎంత ఖరీదైనవో మరోసారి వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అక్కడ ప్రసవ ఖర్చులు సామాన్యుల్ని వణికిస్తున్నాయి. అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయ మహిళ తన ప్రసవ అనుభవాన్ని వెల్లడిస్తూ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిడ్డ జననానికి వచ్చిన మొత్తం ఖర్చు వింటే షాక్ అవ్వాల్సిందే.

ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో ప్రసవం అనేది సరదా వ్యవహారం కాదని.. తమ బిడ్డ పుట్టిన తర్వాత ఆస్పత్రి నుంచి వచ్చిన బిల్లు దాదాపు రూ.79 లక్షలకు చేరిందని వెల్లడించారు. ఒక సాధారణ డెలివరీకే ఇంత భారీ మొత్తం రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఆరోగ్య బీమా ఉండటంతో ఆ మొత్తాన్ని తాము చెల్లించలేదని, అందులో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే తమ జేబు నుంచి చెల్లించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

బీమా లేకపోతే ఈ మొత్తం భారమంతా కుటుంబానికే మోయాల్సి వచ్చేదని, అప్పుడే అమెరికాలో వైద్య వ్యయాల తీవ్రత అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రసవానికి ముందు, తర్వాత చేసే పరీక్షలు, వైద్యుల ఫీజులు, హాస్పిటల్ రూమ్ చార్జీలు, నర్సింగ్ కేర్ వంటి అంశాలన్నీ కలిస్తే బిల్లు ఆ స్థాయికి చేరిందని వివరించారు.

ఈ సందర్భంగా ఆమె భారత్‌లోని పరిస్థితిని కూడా ప్రస్తావించారు. భారత్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవానికి గరిష్ఠంగా లక్షల్లోనే ఖర్చవుతుందని, సాధారణ కుటుంబాలు కూడా భరించగలిగే స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అదే అమెరికాలో అయితే బీమా లేకుండా ప్రసవం చేయించడం చాలా మందికి అసాధ్యమనే చెప్పాలి అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన తర్వాత అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లోనూ చర్చ మొదలైంది. విదేశాల్లో జీవితం ఎంత సౌకర్యవంతంగా కనిపించినా.. వైద్య ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా ఎంత కీలకమో ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ALSO READ: అర్ధరాత్రి కుక్కల గోల వల్ల బయటకు వచ్చిన యువకుడు.. తర్వాత భయానక ఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button