తెలంగాణ

మైలార్ దేవుపల్లి పరిధిలో స్కూల్ బస్సులో మంటలు

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భయానక అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మీగూడ, ఎయిర్‌పోర్ట్ కార్గో రోడ్డులో ప్రయాణిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు ఆకస్మాత్తుగా మంటలతో ఆవృతమైంది. సమాచారం ప్రకారం, బస్సు విద్యార్థులను దింపి తిరిగి నాదర్‌గుల్‌ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్‌ భాగంలో స్పార్క్‌ రావడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. అదృష్టవశాత్తు ఘటన సమయంలో విద్యార్థులు ఎవరూ బస్సులో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ తక్షణమే బస్సు ఆపి బయటకు దూకడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా ధ్వంసమవ్వగా, మైలార్ దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రాథమికంగా ఇది ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:మేడ్చల్ లో దారుణం – తండ్రిని హత్య చేసిన కొడుకు

Also Read:నటి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే సన్యాసం అంటా?

Back to top button