జాతీయం

Yogi Adityanath: అయోధ్య అయిపోయింది, నెక్ట్స్ టార్గెట్ ఏంటో చెప్పిన యోగీ!

సుప్రీం తీర్పుతో అయోధ్య రామాలయం పూర్తి అయ్యిందన్న సీఎం యోగీ.. తర్వాత టార్గెట్స్ ఏంటో చెప్పారు. దేశ సమున్నత వారసత్వాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసగుతున్నాయన్నారు.

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, అయోధ్య తర్వాత తమ టార్గెట్‌, ఉత్తరప్రదేశ్ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను వెల్లడించారు. అయోధ్య నిర్మాణం తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన సమ్మిట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

అయోధ్య తర్వాత లక్ష్యాలు అవే..

రెండుసార్లు వరుసగా ముఖ్యమంత్రిగా తన హయాలో జరిగిన రామమందిర శంకుస్థాపన, నిర్మాణంతో పాటు గత వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీరామాలయంపై ధర్మ ధ్వజ స్థాపన చేయడం చిరకాలం తనకు గుర్తుండిపోతాయని చెప్పారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వివాదం, మధురలోని కృష్ణజన్మభూమి వివాదం తదుపరి లక్ష్యం అనుకోవచ్చా? అని అడిగినప్పుడు తాము అన్ని ప్రాంతాలకు చేరుకుంటామని, ఇప్పటికే చేరుకున్నామని యోగీ సమాధానమిచ్చారు.

ప్రతి సమాజం తమ వారసత్వాన్ని గర్వకారణంగా భావిస్తుందని, తమ ప్రయత్నాలు ఆ దిశగానే ఉంటాయని చెప్పారు. అయోధ్య రామాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాము రుణపడి ఉంటామని,  వివాదాస్పద కట్టడం బాబ్రీ మసీదును తొలగించి దేశ సమున్నత వారసత్వాన్ని పునరుద్ధరించామన్నారు. భవిష్యత్తులో ఏది జరిగినా ఇదే తరహాలో తాము కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు.

2030 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

2029-30 నాటికి ఉత్తరప్రదేశ్ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు, 2047 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ తప్పనిసరిగా ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులకు అర్థం ఉండేది కాదని, వ్యక్తికి భద్రత లేనప్పుడు పెట్టుబడులు ఎలా భద్రంగా ఉంటాయని యోగి ప్రశ్నించారు.

పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు నేరాలు, నేరగాళ్లను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదంటూ జీరో టాలరెన్స్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. ఇవాళ మెరుగైన శాంతిభద్రతల పరిస్థితితో తాను సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. తమ ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి సారించిందని, ఈ దిశగా మెట్రో, ఎక్‌ప్రెస్‌వేస్, విమానాశ్రయాల్లో ప్రగతి సాధించామని చెప్పారు.  ఉత్తరప్రదేశ్‌లో తమ భద్రతకు ఢోకాలేదని మహిళలు సంతృప్తిగా ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర పథకాల నుంచి వారు లబ్ధి పొందుతున్నారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button