
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన హస్తనలోనే పర్యటించనున్నారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు.కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించనున్నారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సీడబ్ల్యూసీ అధికారులకు కూడా అందజేయనున్నారు.
ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ తో సీఎం రేవంత్ బృందం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. టోనీ బ్లెయిర్ ప్రస్తుతం టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ అనే ఎన్‌జీవో సంస్థను రన్ చేస్తున్నారు. ప్రస్తుతం టీబీఐ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడుల అంశంపై బ్లెయిర్‌తో చర్చించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దలను సీఎం రేవంత్ టీమ్ కలవనుందని తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. చివరగా ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి పార్టీలో పదవుల భర్తీ, పెండింగ్‌లో ఉన్న పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.