
హైదరాబాద్ నగరంలో మద్యం మత్తు మరో షాకింగ్ ఘటనకు కారణమైంది. మద్యం సేవించి ఆటో నడిపిన ఓ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయి, అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. ఆటోను సీజ్ చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్.. ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసి పోలీసులను బెదిరించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విస్తృత చర్చకు దారితీస్తోంది.
హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ నేపథ్యంలో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా మద్యం మత్తులో ఆటో నడుపుతున్న ఓ డ్రైవర్‌ను పోలీసులు ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా అతడికి 150 రీడింగ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిబంధనల ప్రకారం అతడిపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు.
అయితే ఆటో సీజ్ చేయడాన్ని ఆ డ్రైవర్ జీర్ణించుకోలేకపోయాడు. మద్యం మత్తులోనే పోలీసులతో వాగ్వాదానికి దిగిన అతడు.. ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసుకొచ్చి కలకలం సృష్టించాడు. ఆటో వదిలేయకపోతే పామును వదులుతానంటూ పోలీసులను బెదిరించాడు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్ర భయానికి గురిచేశాయి. పరిస్థితి అదుపు తప్పుతుందన్న అంచనాతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో, ఆ ఆటో డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటన మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై చర్చకు తెరతీసింది. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2,731 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు.
ఇక నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత 6 రోజుల్లో రాష్ట్రంలో సుమారు రూ.1,350 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో జరిగే ఘటనలు పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ఘటన మద్యం మత్తు ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: మరోసారి మితిమీరిన అభిమనం.. సెల్ఫీల కోసం అల్లు అర్జున్, స్నేహాలను చుట్టుముట్టిన ఫ్యాన్స్





