తెలంగాణ

శ్రీ గురులోక్ మాసంధ్ ప్రభు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

నారాయణపేట్, ప్రతినిధి, ఏప్రిల్ 9 (క్రైమ్ మిర్రర్):-
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డి పల్లి లో ఈ నెల 11 నుంచి 14 వరకు జరిగే శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు ( బావోజి) బ్రహ్మోత్సవాలకు అధికారులు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నాలుగు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆలయ అవరణలో సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఉత్సవాల ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ కు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్ ను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. నోడల్ అధికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వి.ఐ.పి మేనేజ్ మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దేవాదాయ శాఖ పరంగా ఏం ఏర్పాట్లు చేశారని అడిగారు. ఆలయానికి, రథానికి కలర్స్ వేయిస్తున్నామని, మిగతా జాతర ఏర్పాట్లు చేస్తున్నామని ఈ.వో తెలిపారు. జాతర కోసం తమ శాఖ నుంచి మొత్తం 15 మంది ఉద్యోగులు సిబ్బందిని డిప్యూట్ చేయగా ప్రస్తుతానికి ఇద్దరు వచ్చి విధుల్లో చేరారని, మిగతా 13 మంది రెండు రోజుల్లో వస్తారని ఈ.వో తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ సారి ఆలయంలో 8 సీసీ కెమెరాలు అమర్చుతామని ఈ. వో తెలపగా, పోలీసు శాఖ కోరినట్లు మొత్తం 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ పరంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నీటి వసతి కల్పించామని, అలాగే 8 బ్లాకుల్లో రెండింటి లో స్లాబ్ వేయించామని, టైల్స్, ఆన్ ఆఫ్ ట్యాప్ క్లిప్పు లను ఫిట్ చేయాల్సి ఉందని మిషన్ భగీరథ ఈఈ రంగారావు తెలిపారు.

రెండు పవర్ బోర్లకు మోటార్లు బిగించాల్సి ఉందన్నారు. శానిటేషన్ పరంగా దాదాపు 300 మంది కార్మికులతో పారిశుద్ధ్య సేవలు చేస్తామని, మూడు. సిఫ్టులలో వంద మంది చొప్పున కార్మికుల సేవలు అందుబాటులో ఉంటాయని డీఎల్ పీ వో సుధాకర్ రెడ్డి తెలిపారు. జాతర నాలుగు రోజులు తిమ్మారెడ్డి పల్లి లో సెల్ ఫోన్ లు కలవవు అని, తమకు వాకీ టాకీ లు ఇవ్వాలని డీ ఎల్ పి వో సుధాకర్ జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ను కోరారు. జాతరలో ఒక డాక్టర్, సూపర్ వైజర్ , ఏ ఎన్ ఎం, ఆశాలతో మూడు సిఫ్టులలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని ఇంచార్జీ డీ ఎం అండ్ హెచ్ ఓ శైలజ తెలిపారు. జాతరలో బారీ కేడ్లు ఏర్పాటు చేస్తామని పి అర్ అధికారి విలోక్ చెప్పారు. అగ్నిమాపక శాఖ పరంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఫైర్ అధికారి చెప్పారు. జాతరకు వచ్చే భక్తుల కోసం కోస్గి డిపో నుంచి 8 బస్సులు నడిపిస్తామని, మహబూబ్ నగర్ డిపో నుంచి అదనంగా మరికొన్ని బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డి ఎం లావణ్య తెలిపారు. జాతరలో భక్తుల కోసం దుస్తులు మార్చుకునే షెడ్లను ఏర్పాటు చేయడంతో మొబైల్ టాయిలెట్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యుత్ శాఖ పరంగా అవసరమైన విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగనట్లు మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ ను ఉంచుతామని విద్యుత్తు శాఖ అధికారి తెలిపారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా జాతరలో దొంగతనాలు, ఈవ్ టీజింగ్ జరగకుండా మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామచందర్ నాయక్, డిఏస్పి నల్లపు లింగయ్య, సీ ఐ సైదులు, తహాసిల్దార్ జయరాములు, ఎంపీడీఓ కృష్ణా రావు, సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button