Upendra Dwivedi On Operation Sindoor: ఢిల్లీలో కారు బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలనం వ్యాఖ్యలు చేశారు. భారత్ చర్యలు ఉగ్రవాదానికి వణుకు పుట్టించేలా ఉంబోతున్నాయన్నారు. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై జరిగిన ఆపరేషన్ సిందూర్ నుంచి తాము అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఒక ట్రైలర్ మాత్రమేనని, పొరుగుదేశం మళ్లీ దారి తప్పితే గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ‘చాణక్య రక్షణ సదస్సు’లో మాట్లాడిన ఆయన, పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం!
భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ద్వివేది వెల్లడించారు. పాక్ తిరిగి దారి తప్పితే ఎలా బాధ్యతగా వ్యవహరించాలో గుణపాఠం నేర్పిస్తామన్నారు. ఎప్పుడు ఆపరేషన్ చేపట్టినా దాని నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడం జరుగుతుందన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. ప్రతి దశలోనూ సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం అనివార్యమని చెప్పారు. బలగాల మధ్య సమన్యయం చాలా అవసరమని, అందులోనూ యుద్ధాలు ఇవాళ బహుళ మాధ్యమాల్లో జరుగుతున్నాయని అన్నారు. భూమి, ఆకాశం, సైబర్ రంగం, సమాచార యుద్ధం… కలిస్తేనే సమగ్ర యుద్ధం అవుతోందన్నారు. శత్రువులతో ఆర్మీ మాత్రమే యుద్ధం సాగించలేదని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
BREAKING : Big statement by Army Chief. Army Chief Gen Upendra Dwivedi, speaking at the Chanakya Defence Dialogue on Ope Sindoor, says, “The movie hadn’t even begun, it was just a trailer. If Pakistan gives us an opportunity, we will teach them how a neighbour should behave.” pic.twitter.com/QIOwxdDQXI
— Baba Banaras™ (@RealBababanaras) November 17, 2025
యుద్ధం ఎంత కాలం జరుగుతుందో చెప్పలేం!
ఈ రోజుల్లో యుద్ధం వస్తే ఎంత కాలం జరుగుతుందో చెప్పలేమన్నారు. ఆపరేషన్ సిందూర్ 88 గంటలపాటు సాగించామని, వచ్చేసారి నాలుగు నెలలైనా కావచ్చు, నాలుగేళ్లూ పట్టవచ్చని అన్నారు. ఇలాంటప్పుడు యుద్ధానికి సరిపడినన్ని ఆయుధాలు మన వద్ద ఉన్నాయా? అనేది చూసుకోవాలని, లేనిపక్షంలో అందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.





