క్రైమ్

సెలూన్ షాపు పేరుతో తుపాకుల విక్రయం – అంతరాష్ట్ర ముఠా అరెస్టు

రాచకొండ పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకొని 5 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : హైదరాబాద్‌ లో సెలూన్ షాపుల ముసుగులో తుపాకుల విక్రయాలు చేస్తూ, పౌరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంతరాష్ట్ర ముఠాను మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ, బాలాపూర్ పోలీసుల సకాలిక చర్యతో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాతో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌కు చెందిన మహ్మద్ జీషన్ అలియాస్ జీఖాన్ 2016లో కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి, సంతోష్ నగర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. తన జీవనోపాధి కోసం రక్షాపురం, గోల్కొండ, బాలాపూర్‌ లలో మూడింటిపైగా సెలూన్ షాపులు ప్రారంభించాడు. అయితే ఈ ఆదాయంతో తన లగ్జరీ జీవితానికి తగిన సౌలభ్యం కరువవుతుండడంతో, అతను అక్రమ మార్గాలను ఆశ్రయించాడు.

తన స్నేహితుడు మహ్మద్ అమీర్ ను కూడా తనతో కలిపి ప్లాన్‌ చేసుకున్నాడు. యూపీలో తుపాకుల తయారీదారుడైన అర్షిఖాన్ ను సంప్రదించి, కంట్రీమేడ్ తుపాకులు, బుల్లెట్లు తక్కువ ధరకే కొనుగోలు చేసి నగరానికి తెచ్చారు. ఇవి ఒకోటి రూ.2 లక్షలకు సంఘ వ్యతిరేక శక్తులకు విక్రయించాలన్న వ్యూహంతో బాలాపూర్ షాపులో దాచారు.

విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, బుధవారం ఉదయం జీషన్, అమీర్ లను సెలూన్ షాపు వద్ద పట్టుకున్నారు. 5 కంట్రీమేడ్ తుపాకులు, 18 బుల్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌తో నగరంలో పెద్ద ప్రమాదాన్ని పోలీసులు అడ్డుకున్నారని, ఇలాంటి సంఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ పోలీసుల అప్రమత్తత, సూటిగా స్పందనకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Back to top button