తెలంగాణ

కాంగ్రెస్ నాయకుల వేధింపులు..మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్

కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు వణికిపోతున్నారు. కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేయడానికి కూడా సిద్దపడుతున్నారు. మరికొందరు తాము డ్యూటీలో చేయలేమంటూ లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లిపోతున్నారు. వేములవాడలో మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. తాము చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు దూషించడంతోనే మహిళా కార్యదర్శి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

“అమ్మా నాన్న నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న, ఈ కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేపకోతున్న” అంటూ లేఖ రాసి అదృశ్యమైంది మహిళా పంచాయతీ కార్యదర్శి ప్రియాంక.డీపీఓకు వాట్సప్ ద్వారా రాజీనామా లేఖను పంపి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది ప్రియాంక

వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణాకు చెందిన ప్రియాంక, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది. బద్దెనపల్లి గ్రామానికి చెందిన నలుగురు కాంగ్రెస్ నాయకులు తనను వేధిస్తున్నారని, ఇంకుడు గుంతల విషయంలో జీపీ కార్యాలయంలో అందరిముందే తనను తీవ్రంగా దూషించారని ప్రియాంక తన లేఖలో పేర్కొంది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తాము చెప్పినవారినే ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకులు బెదిరించారని జీపీ కార్యాలయ సిబ్బంది వెల్లడించారు

అయితే సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితా అందజేయాల్సి ఉండగా, ప్రియాంక తన రాజీనామా లేఖను డీపీఓకు వాట్సప్ ద్వారా పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళింది.కుటుంబసభ్యులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు ప్రియాంక డైరీ, ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.ప్రియాంక ఫోన్ ట్రేస్ చేయడంతో ఆమె తిరుపతిలో ఉన్నట్టు గుర్తించారు, దీంతో కుటుంబసభ్యులు ఆమెకోసం తిరుపతి బయలుదేరారు. తన కూతురుని వేధించడం ఆపమని కాంగ్రెస్ నాయకులను ఎంత వేడుకున్నా వినలేదని ప్రియాంక తండ్రి రాజేశం ఆవేదన వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button