Homeక్రీడలుT20 World Cup: పాండ్యా, అభిషేక్ మెరుపులు.. సెమీస్ రేసులో టీమిండియా!

T20 World Cup: పాండ్యా, అభిషేక్ మెరుపులు.. సెమీస్ రేసులో టీమిండియా!

  • చావోరేవో పోరులో భారత జట్టు దూకుడు

  • ఆకాశమే హద్దుగా చెలరేగిన టాపార్డర్

  • జింబాబ్వేపై 72 పరుగులతో గ్రాండ్ విక్టరీ  

చావోరేవో పోరులో భారత జట్టు జూలు విదిల్చింది. టాపార్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు స్కోరందించగా.. జింబాబ్వేపై 72 పరుగులతో జయభేరి మోగించింది టీమిండియా. తొలిపోరులో దక్షిణాఫ్రికా చేతితో కంగుతిన్న టీమిండియా ఈ విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గ్రూప్ ఏ నుంచి సఫారీ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది.

కీలక మ్యాచ్ లో సంచలన విజయం

లీగ్ దశను అజేయంగా ముగించి.. సూపర్ 8ను ఓటమితో ఆరంభించిన భారత్.. కీలక మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసింది. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. చెపాక్‌లో ఆఫ్రికా జట్టుపై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే.. వెస్టిండీస్‌పై 9 వికెట్లతో జయభేరి మోగించిన సఫారీ టీమ్.. గ్రూప్ ఏ నుంచి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ పరిస్థితుల్లో చివరి నాకౌట్ పోరు భారత్, కరీబియన్ జట్టుకు కీలకం కానుంది. గెలిచిన జట్టు ముందంజ వేస్తుంది. ఒకవేళ మ్యాచ్ రద్దైతే.. మెరుగైన రన్‌రేటున్న విండీస్ సెమీస్‌ బెర్తు ఖాయం అవుతుంద.

దూకుడుగా ఆడిన జింబాబ్వే

రికార్డు ఛేదనలో జింబాబ్వే ఇన్నింగ్స్‌ ను ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్(97 నాటౌట్), మరుమని(20)లు దూకుడగా ఆరంభించారు. పవర్ ప్లేలో వీరిద్దరూ స్కోర్ 40 దాటించారు. అయితే.. అక్షర్ పటేల్ ఓవర్లో మరుమని షాట్ ఆడి ఇషాన్ చేతికి చిక్కాడు. కాసేపటికే డియన్ మైయర్స్(6)ను వరుణ్ చక్రవర్తి వెనక్కి పంపాడు. అనంతరం కెప్టెన్ సికిందర్ రజా(31) జతగా బెన్నెట్ పెద్ద షాట్లు ఆడాడు. వీరిద్దరూ సిక్సర్లతో అలరిస్తూ అర్ధ శతకం భాగస్వామ్యం నెలకొల్పారు. రజాను అర్ష్‌దీప్ ఔట్ చేయగా.. మున్యోగా( 11), ముసెకివా(7)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఓవైపు వికెట్లు పడుతున్నా బెన్నెట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు చెలరేగి సెంచరీకి చేరువయ్యాడు. కానీ.. ఓవర్లో సిక్స్, ఫోర్ రావడంతో జింబాబ్వే 184కే పరిమితమైంది.

బ్యాటింగ్ లో పాండ్యా, అభిషేక్ దూకుడు

సెమీస్ ఆశలు నిలవాలటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55) ఫామ్ చాటుకుంటూ అర్ధశతకంతో రెచ్చిపోగా.. వచ్చినవాళ్లు వచ్చినట్టు దుమ్మురేపారు. జింబాబ్వే బౌలర్లను హడలెత్తిస్తూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(33), తిలక్ వర్మ(44 నాటౌట్‌) సత్తా చాటారు. హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) తన స్టయిల్  ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. టాపార్డర్ సహా మిడిల్ మెరుపులతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో 256 పరుగులతో అత్యధిక రన్స్ సాధించిన టీమ్ గా భారత్ రికార్డు క్రియేట్ చేసింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు