
Suspected Death: హైదరాబాద్ నగరంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ప్రశాంత్ అనే విద్యార్థి తన ఇంటిలోని బాత్రూంలో స్కూల్ ఐడీ కార్డుతో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. చిన్న వయసులోనే ఇలా ప్రాణాలు విడిచిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
రోజూ మాదిరిగానే ప్రశాంత్ స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన వెంటనే డ్రెస్ మార్చుకుంటానని చెప్పి బాత్రూంలోకి వెళ్లాడు. కొంతసేపటికి తలుపు వేసుకుని బాత్రూంలో నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎన్నిసార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో చివరికి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు.
లోపల చూసేసరికి బట్టలు ఆరేసేందుకు కట్టిన వైర్‌కు తన స్కూల్ ఐడీ కార్డుతో ఉరేసుకుని ప్రశాంత్ కనిపించాడు. ఆ దృశ్యం చూసిన తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందారు. వెంటనే అతడిని కాపాడేందుకు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రోజూ చురుకుగా, ఉత్సాహంగా ఉండే నా కొడుకు ఇలా ఎందుకు చేసుకున్నాడో అర్థం కావడం లేదంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రశాంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంత చిన్న వయసులో బాలుడు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో పాటు అతని స్నేహితులు, స్కూల్ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. పాఠశాలలో గానీ, ఇంటి వద్ద గానీ ఏదైనా ఒత్తిడి, వేధింపులు లేదా మానసిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. బాలుడి మృతి వెనుక ఉన్న అసలు కారణాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.
ALSO READ: FLASH NEWS: ఈ గ్రామాలలో ఎన్నికలకు బ్రేక్!





