Supreme Court: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక!

యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. యూజీసీ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని వెల్లడించింది.

UGC Rules Put on Hold: యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించేందుకంటూ యూజీసీ తెచ్చిన నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?

యూజీసీ విధివిధానాలు అస్పష్టంగా ఉన్నాయని, వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. కొత్త నిబంధనల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత దేశంలో కులవివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించాం? ఈ విషయంలో మనం మళ్లీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా? అనే భావన కలుగుతోంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటివారిని ర్యాగింగ్‌ పేరుతో కొందరు అవహేళన చేస్తుండడం అత్యంత బాధాకరం. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టళ్లు ఉండాలని మాట్లాడుతున్నారు. కానీ, ప్రస్తుతం సమాజంలో కులాంతర వివాహాలే జరుగుతున్నాయి. హాస్టళ్లలోనూ అందరూ కలిసే ఉంటున్నారు. అలాగే, ఐక్య భారత విధానం మన విద్యాసంస్థల్లో స్పష్టంగా ప్రతిబింబించాలి. విద్యా సంస్థల్లో స్వేచ్ఛాయుత, సమానత్వ వాతావరణాన్ని మేం కోరుకుంటున్నాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  ఈ విషయంలో తాము జోక్యం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. సమాజాన్ని విభజిస్తుంది. కొత్త విధివిధానాల్లో భాషే అస్పష్టంగా ఉంది. నిపుణులు పరిశీలించి, దాన్ని సరిచేయాలని తేల్చి చెప్పింది.

అసలు విషయం ఏంటంటే?

ప్రతి ఉన్నత విద్యాసంస్థలోనూ  సమానత్వ కమిటీల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించింది.  యూజీసీ కొత్త నిబంధనలను ఈ నెల 13 నుంచి అమలులోకి తెచ్చింది. వీటిలో కులవివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే యూజీసీ నిబంధనలను సవాల్‌ చేస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కుల ఆధారిత వివక్ష కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకంగా మాత్రమే జరుగుతుందన్న భావన ఆధారంగా ఈ ఉత్తర్వులను యూజీసీ రూపొందించినట్లు ఉందని అందులో పేర్కొన్నారు. కులం ఆధారంగా జనరల్‌ లేదా నాన్‌ రిజర్వ్‌ డ్‌ విభాగాల విద్యార్థులు కూడా వివక్షను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కులానికి తావివ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలా యూజీసీకి ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో పిటిషనర్‌ కోరారు. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు యూజీసీ నిబంధనలపై స్టే అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button