
Supreme Court Verdict: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి తోసిపుచ్చింది జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. అటు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్ ఆదేశించారు.
పార్టీ ఫిరాయింపులపై సుదీర్ఘ వాదనలు
అటు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? లేదా? అనే అంశంపైనా సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఈ వాదనల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం. తాజాగా తీర్పు వెల్లడించింది. “ పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదంటే 3 నెలల్లోపు నిర్ణయించాలి. ఏ ఎమ్మెల్యే అయినా.. స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారింది. దాన్ని అరికట్టకపోతే.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉంది. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారు. స్పీకర్ ఒక న్యాయనిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్ గా వ్యవహరిస్తారు” అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
Read Also: ఎమ్మెల్యేల అనర్హత కేసు.. ఇవాళే సుప్రీం తుది తీర్పు!