
Supreme Court Orders: అత్తింట్లో వేధింపులు ఎదుర్కొంటూనే శివంగి అనే మహిళ 2022లో యూపీఎస్సీకి ఎంపికయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వేధింపుల కథ కొత్త మలుపు తీసుకుంది. శివంగిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు కేసులు పెట్టి మాజీ భర్త, అత్తింటి వారిని వేధింపులకు గురి చేసిందంటూ ఆమెపై మండిపడింది. సదరు అధికారి, ఆమె తల్లిదండ్రులు.. మాజీ భర్తతోపాటు ఆయన కుటుంబీకులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ప్రముఖ జాతీయ ఆంగ్ల, హిందీ దినపత్రికల్లో ఆ విషయాన్ని వెల్లడించాలని.. సోషల్ మీడియాలోనూ తెలియజేయాలని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో వారిని ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. కేసులను తగిన అధికార పరిధికి మార్చాలంటూ ఇరు పక్షాలు నమోదు చేసిన బదిలీ పిటిషన్లను పరిశీలించిన సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
లేడీ ఐపీఎస్ పై సుప్రీం నిప్పులు!
శివంగికి 2015లో షాహిబ్ బన్సాల్ తో పెళ్లి అయ్యింది. వారికి ఓ కూతురు పుట్టింది. గొడవల కారణంగా 2018 నుంచి విడిగా ఉంటున్నారు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. శివంగి గృహహింస, హత్యాయత్నం, అత్యాచారం సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త షాహిబ్ 109 రోజులు, ఆయన తండ్రి 103రోజులు జైలుకు వెళ్లారు. తాజాగా ఈ కేసును సుప్రీం కోర్టు విచారించింది. శివంగి పెట్టిన కేసులను తప్పుడు కేసులుగా గుర్తించింది. షాహిబ్ ఆ కుటుంబం ఎంతో మానసిక వేదనకు గురైందని.. దీనికి ఏరకంగానూ పరిహారం చెల్లించలేమని వెల్లడించింది. ఇప్పుడు ఆమెకు అందుతున్న భరణంతోపాటు మాజీ భర్త ఆస్తిలో హక్కు వదుకోవాలని శివంగిని ఆదేశించింది. ఈ వ్యవహారంలో నమోదైన అన్ని కేసులను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
Read Also: ఎయిర్ హోస్టెస్ పై పైలట్ అత్యాచారం, పరారీలో నిందితుడు!