
Sugar: ఈ రోజుల్లో ఆహారంలో చక్కెర వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తీపి పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, బేకరీ పదార్థాల వల్ల తెలియకుండానే శరీరానికి అవసరమైనదానికంటే ఎక్కువ చక్కెర చేరుతోంది. దీనివల్ల ఊబకాయం, టైప్ టూ డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే రోజూ ఎంత మోతాదులో చక్కెర తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన ఉండటం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం పెద్దవయసు పురుషులు రోజుకు గరిష్టంగా 36 గ్రాముల వరకు మాత్రమే అదనపు చక్కెర తీసుకోవాలి. ఇది సుమారుగా తొమ్మిది టీస్పూన్లకు సమానం. ఈ పరిమితిని మించి చక్కెర తీసుకుంటే శరీరంలో అవసరం లేని కేలరీలు పేరుకుపోతాయి. ఫలితంగా బరువు పెరగడం మొదలై, క్రమంగా మెటబాలిజం మందగించి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు రోజుకు 25 గ్రాముల లోపే చక్కెర తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే సుమారు ఆరు టీస్పూన్లకు మించకూడదు. ఈ వయస్సులో అధికంగా చక్కెర తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగి చిన్న వయసులోనే డయాబెటిస్ ముప్పు ఏర్పడుతుంది. రెండేళ్లలోపు పిల్లలకు అదనపు చక్కెర పూర్తిగా నివారించాలి. ఈ దశలో సహజమైన తీపి ఉన్న పండ్లు, పోషకాహారమే ఇవ్వడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
అధిక చక్కెర వినియోగం వల్ల శరీర బరువు పెరగడమే కాకుండా కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్యలు రావచ్చు. అలాగే రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు పెరగడంతో గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చిన్నప్పటి నుంచే తక్కువ చక్కెర తినే అలవాటు పెడితే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోజూ తీసుకునే ఆహారంలో ఎంత చక్కెర ఉందో గమనిస్తూ, పరిమితంగా తీపి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంగా జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
ALSO READ: భర్త నైట్ డ్యూటీకి వెళ్లాక ప్రియుడిని ఇంటికి పిలిచిన మహిళ, ఆపై దారుణం





