
Supreme Court: రోడ్డు ప్రమాదాలకు కారణం నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎలాంటి సిగ్నల్, వార్నింగ్ లేకుండా హైవేపై సడన్ బ్రేక్ వేయడం నిర్లక్ష్యం కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. జరిగిన ప్రమాదానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. హైవేపై అందరూ వేగంగానే వెళ్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో రోడ్డు మధ్యలో ఆకస్మికంగా బ్రేక్ వేయడం ప్రమాదానికి కారణం అవుతుందని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన ధర్మాసనం తెలిపింది.
ఇంజినీరింగ్ విద్యార్థి కేసులో కీలక తీర్పు
2017 జనవరి 7న కోయంబత్తూర్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మహమ్మద్ హకీం బైక్ మీద వెళ్తుండగా, ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వెళ్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో దానికి తగిలి కింద పడ్డాడు. వెనుక నుంచి వచ్చిన బస్సు అతడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. పరిహారం కోరుతూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైవే మీద సడన్ బ్రేకు వేయడాన్ని సమర్థించబోమని వెల్లడించింది. కారు డ్రైవర్ 50%, బస్సు డ్రైవర్ 30%, బైకు నడిపిన విద్యార్థి 20% బాధ్యత వహించాలని వెల్లడించింది. బీమా కంపెనీలు రూ.1.14 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, విద్యార్థిది 20% తప్పుకు సంబంధించిన అంత పరిహారాన్ని తగ్గించి మిగిలిన సొమ్మును 4 వారాల్లో బాధితుడికి అందజేయాలని ఆదేశించింది.
Read Also: వేధించిన జడ్జికి ప్రమోషన్, మహిళా న్యాయమూర్తి రాజీనామా!