తెలంగాణ

బస్సు కోసం విద్యార్థుల బాధలు… రోడ్ల మీద వాహనాలను ఆపుతూ ఇబ్బందులు

  • మర్రిగూడ – మాల్ రూట్‌లో బస్సుల కోసం అవస్థలు

  • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పిల్లల వేడుకోలు

క్రైమ్ మిర్రర్, మర్రిగూడ: మర్రిగూడ మోడల్ స్కూల్ విద్యార్థుల అవస్థలు అంతాఇంత కాదు. స్కూల్‌ పూర్తయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో బస్సుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారు ఆరు గంటల వరకు రోడ్లపై వాహనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇంటికి త్వరగా వెళ్లాలన్న తొందరలో ప్రైవేట్ వాహనాలను లిఫ్ట్ అడుగుతున్నారు. తప్పతాగి నడుపుతున్న వారి వాహనాలపై వెళ్తూ, బిక్కుబిక్కుమంటూ గమ్యం చేరుకుంటున్నారు. గుర్తు తెలియని వాహనాలను ఆపడం వల్ల, చిన్నారులకు ప్రమాదం లేకపోలేదని పలువురు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ల కారణంగా విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి ఎక్కువగా కనబడుతోందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

ఈ సమస్యపై అధికారుల దృష్టికి కొంతమంది తీసుకువెళ్లినప్పటికీ, ఎలాంటి పరిష్కార చర్యలు లేవని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు రోడ్లపై గంటల తరబడి నిలబడి, వాహనాల కోసం ఎదురుచూస్తున్న తీరు దారిన పోయే వారికి కూడా బాధను కలిగిస్తోంది. రేపటి భవిష్యత్తుకు బాటలు వేసే చిన్నారులు, వాహన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న తీరు మనసులను కలచి వేస్తోంది. ప్లీజ్ బండి ఆపన్న, ఇక్కడి వరకే అంటూ రోడ్డుపైకి పరుగులు తీస్తూ వ్యధను అనుభవిస్తున్నారు. చదువుకోవడం కంటే గమ్యాన్ని చేరడమే చిన్నారులకు సవాలుగా మారింది.

ఈ పరిస్థితిని చూడలేకనే, కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ సమస్యపై స్పందించి సాయంత్రం నాలుగు గంటల నుంచి అయిదు గంటల మధ్యలో మర్రిగూడ నుంచి మాల్ కు రెండు బస్సులను పంపాలని చిన్నారులు కోరుతున్నారు. పిల్లల చదువు కోసం గదులనే కట్టిస్తున్న రాజన్న, పిల్లల భద్రత దృష్ట్యా బస్సులు వేసి మరో పుణ్యం అందుకోవాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button