
క్రైమ్ మిర్రర్, కోదాడ :-
నడిగూడెం :సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం తెల్లవారుజామున విషాదం నెలకొంది. పదవ తరగతి చదువుతోన్న విద్యార్థిని తనూషా మహాలక్ష్మి (14) తరగతి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో తోటి విద్యార్థినులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.
మృతురాలు మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతుల కుమార్తె. 2022లో ఏడో తరగతిలో ఈ పాఠశాలలో చేరిన తనూషా, గత మూడు సంవత్సరాలుగా ఇక్కడే చదువుకుంటోంది. ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లి, 7వ తేదీన తిరిగి పాఠశాలకు చేరింది. గత ఆదివారం తనూషా మహాలక్ష్మిని కలిసేందుకు తల్లి వసుంధర రాగా సోమవారం తండ్రి కూడా వచ్చి వెళ్లునట్లు సిబ్బంది చెప్పారు. కాగా, రాత్రి వరకు కూడా సహ విద్యార్థినులతో కలిసి చదువుకున్న ఆమె, తరగతి గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనపై స్పందించిన డీఈఓ అశోక్, ఎంఈఓ ఉపేందర్ రావు పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. తనూషా ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది.”