క్రైమ్జాతీయం

వివస్త్రను చేసి నగ్నంగా మార్చి దాడి (VIDEO)

దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీ పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసి, హద్దులు దాటి ప్రవర్తించారు. భర్తను నిర్దాక్షిణ్యంగా కొట్టడమే కాకుండా, భార్యపై శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, వారి కుమారుడిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నగ్నంగా చేసి ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌కు చెందిన రాజేశ్ గార్గ్, ఆయన భార్య తమ నివాస భవనంలోని బేస్‌మెంట్‌లో ఒక జిమ్ నిర్వహిస్తున్నారు. అదే జిమ్‌లో కేర్‌టేకర్‌గా పని చేస్తున్న సతీశ్ యాదవ్, జిమ్‌ను అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్టు సమాచారం.

జనవరి 2న జిమ్ ఉన్న బేస్‌మెంట్‌లో నీటి లీక్ సమస్య ఉందని తెలుసుకున్న రాజేశ్ గార్గ్ దంపతులు అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో సతీశ్ యాదవ్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని వారిపై దాడికి పాల్పడ్డాడు. రాజేశ్ గార్గ్‌ను నేలకూల్చి ఇష్టమొచ్చినట్టు కొట్టారని, తన భార్య జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి తీవ్రంగా వేధించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి వారి కుమారుడు వారిని కాపాడేందుకు అక్కడికి చేరుకున్నాడు. అయితే నిందితులు అతడిపైనా దాడి చేసి, బయటకు లాక్కెళ్లారు. నడిరోడ్డుపై బట్టలు విప్పి, అందరి ముందే ఇనుప రాడ్లతో కొట్టారని బాధిత కుటుంబం వాపోయింది. ఈ దాడిలో యువకుడి తలకు తీవ్ర గాయాలు కాగా, ఒక పన్ను విరిగింది. రాజేశ్ గార్గ్‌కు కూడా ముఖంపై తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నడిరోడ్డుపై జరిగిన ఈ అమానుష దాడి సమాజంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు సతీశ్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు వికాస్ యాదవ్, శుభమ్ యాదవ్, ఓంకార్ యాదవ్ పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజీ, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా కేసును మరింత బలంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలు, కుటుంబాల భద్రతపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ప్రతి ఇంటికి ఉచితంగా రూ.6 లక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button