
Star Fruit: శీతాకాలం ప్రారంభమైతే మార్కెట్‌లో ఎన్నో రకాల పండ్లు వరుసగా కనిపిస్తాయి. వాటిలో ప్రత్యేకంగా ఆకృతి, రుచి, పోషకాలతో అందరినీ ఆకట్టుకునేది ‘స్టార్ ఫ్రూట్’. దీనిని దేశంలోని పలు ప్రాంతాల్లో ధరేహులి, కరంబల పండు, కరాంబోలా, కర్బల, కామరాద్రాక్షి, నక్షత్ర హులి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఆక్సిడేసి కుటుంబానికి చెందిన ఈ పండు శాస్త్రీయంగా అవెర్రోవా కారాంబోలా పేరుతో గుర్తింపుపొందింది. నక్షత్రం ఆకారంలో ఉండే ఈ ఫలం కేవలం చూడ్డానికి అందంగా ఉండడమే కాకుండా, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.
స్టార్ ఫ్రూట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉండటంతో శరీరానికి అవసరమైన జీర్ణ సంబంధిత పనులను సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. పోషకాహార నిపుణులు ఈ పండును రోజువారీ ఆహారంలో చేర్చాలని సూచించడానికి ప్రధాన కారణం ఇదే. చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఈ పండును తేలికగా తినగలరనే విషయం ప్రత్యేకం.
స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. శీతాకాలంలో ఎక్కువగా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేయడంలో ఈ పండు సహాయపడుతుంది. శరీరం సహజంగా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. చర్మ ఆరోగ్యం పరంగా కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పొడిబారిన చర్మాన్ని కాపాడి, సహజ కాంతిని కలిగిస్తుంది.
ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సాధారణ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి సాయం చేస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే అలసట, బలహీనత వంటి సమస్యలకు కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. నరాల బలహీనత తగ్గి మెదడు పనితీరు మెరుగుపడటంలో పాత్ర పోషిస్తుంది. స్టార్ ఫ్రూట్‌లో ఉన్న విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి శుక్లం, దృష్టి మందగించడం వంటి సమస్యలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పిల్లలు, పెద్దలు తినడం ద్వారా కంటి దృష్టి బలపడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే కంటి సమస్యలను నియంత్రించడంలో ఈ పండు సహాయపడుతుంది.
ఈ పండును ముక్కలుగా కోసి నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్, సలాడ్, ఫ్రూట్ బౌల్స్ వంటి వంటకాల్లో చేర్చుకోవచ్చు. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందించడంతో పాటు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో కూడా కొంతవరకు సాయం చేస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ పండును తినే విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే స్టార్ ఫ్రూట్‌లో ఉండే ఆక్సాలేట్ కొన్ని ఆరోగ్య పరిస్థితులను ప్రభావిత పరచే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రం ఇది ఎంతో మంచిది.
NOTE: పై సమాచారాన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే ప్రచురించాము. ‘క్రైమ్ మిర్రర్’ దీనిని అధికారికంగా ధృవీకరించట్లేదు.
ALSO READ: VIRAL VIDEO: మధ్యలో నువ్వేంది.. పోలీసును నెట్టేసిన ఏనుగు





