తెలంగాణ

శ్రీశైలంలోకి తగ్గిన ఇన్ ఫ్లో, సాగర్ నిండేది ఎప్పుడు?

Srisailam-Nagarjuna Sagar Updates:  కృష్ణా పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మకు వరద ప్రవాహం తగ్గింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో నెమ్మదిగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయానికి కేవలం 73,586 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. ఒక గేటు ఎత్తి 27,296 కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 68,382 క్యూసెక్కులను వదులుతున్నారు.

రెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు క్లోజ్

ఇన్ ఫ్లో ఇలాగే తగ్గితే, మరో రెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు మూసివేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206.09 టీఎంసీల నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా, ఒక గేటు ద్వారా 6,823 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 36,035 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి.

సాగర్ నిండేది ఎప్పుడు?

అటు నాగార్జునసాగర్ జలయాశంలోకి ఎగువ నుంచి వస్తున్నవరద నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ లోకి 87,301 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 551.10 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా,  ప్రస్తుతం 209 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నుంచి హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో ఇప్పట్లో సాగర్ నిండే అవకాశం కనిపించడం లేదు.

ఇక ఆల్మట్టి ప్రాజెక్టు కూడా ఇన్‌ ఫ్లో 69,084 క్యూసెక్కులకు తగ్గింది. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా, అవుట్‌ ఫ్లో 3 వేల క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్రకు ఇన్‌ ఫ్లో తగ్గిపోవడంతో 30,728 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది.  నీటిమట్టం 4.20 మీటర్లు ఉంది. కుంగిన ఏడో బ్లాక్‌ లోని గేట్లతో పాటు మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Read Also: రైతుగా మారి.. అంతరిక్షంలో ఆకుకూరలు పెంచుతున్న శుభాన్షు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button