
Srisailam Project Inflow: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో శ్రీశైలం జలాయశానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 1.7 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలోని ఎడమ, కుడి విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు నీటి మట్టం విషయానికి వస్తే, పూర్తి నీటి సామర్థ్యం 215. 80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 173.47 టీఎంసీలుగా ఉన్నాయి. విద్యుత్ తయారీ కారణంగా 67 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
నెల రోజుల క్రితమే మరమ్మతులు చేసినా..
శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. నెల రోజు క్రితమే మరమ్మతులు చేసినా, ఏమాత్రం ప్రయోజనం లేదు. 10వ నెంబర్ క్రస్ట్ గేటు నుంచి భారీగా నీళ్లు లీక్ అవుతున్నాయి. 5, 6 గేట్ల నుంచి స్వల్పంగా నీరు లీక్ అవుతోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సాగర్ లోకి 55 వేల క్యూసెక్కుల వరద
విద్యుత్ కేంద్రాల ద్వారా నీరు కిందికి రావడంతో పాటు లీకేజీల కారణంగా దిగువకు భారీగా వరద నీరు వస్తోంది. సుమారు 55 వేల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 156.86 టీఎంసీలు. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 1.24 లక్షల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు.
తుంగభద్రకు భారీగా ఇన్ ఫ్లో
మరోవైపు తుంగభద్ర రిజర్వాయర్ కు 72 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇప్పటికే అన్ని గేట్లు ఓపెన్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 65 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి బేసిన్ లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 5,477 క్యూసెక్కులు, మేడిగడ్డ బ్యారేజీకి 76,600 క్యూసెక్కుల వరద వస్తోంది.
Read Also: ఉత్తరాదిని ముంచెత్తిన భారీ వర్షాలు, హిమాచల్ అతలాకుతలం!