
Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న 5 ఏండ్లలో కొత్త రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలంటున్నారు. లేకపోతే, తుంగభద్ర లాంటి పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
శ్రీశైలం గేట్లు పరిశీలించిన కన్నయ్య నాయుడు
శ్రీశైలం ప్రాజెక్టును తాజాగా క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు. జలాశయానికి సంబందించిన రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని స్టడీ చేశారు. అన్ని గేట్లను తనిఖీ చేశారు. 10వ నంబర్ గేటు ద్వారా వచ్చే లీకేజీ వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదన్నారు. గేటు నుంచి లీకేజీ అనేది 10 శాతం కంటే తక్కువగానే ఉందన్నారు. అయితే, క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా ముప్పు తప్పదన్నారు. లేదంటే ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టుకు పట్టిన గతే దీనికీ పడుతుందని ఆయన హెచ్చరించారు.
క్రస్ట్ గేట్ల నిర్వహణకు నిధులు కేటాయించాలన్న కన్నయ్య
శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన క్రస్ట్ గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు కన్నయ్య నాయుడు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఉందన్న ఆయన, దాని వల్ల శ్రీశైలం ఆనకట్ట పునాదులకు ఎలాంటి మప్పులేదన్నారు.
Read Also: ఏపీలో వానలే వానలు, ఎన్ని రోజులంటే?