
Sperm Count: నేటి బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు చాలా మందిలో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలే కాకుండా సంతానోత్పత్తి సంబంధిత ఇబ్బందులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడం, శుక్రకణాల నాణ్యత పడిపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. దీని ప్రభావంతో సహజ గర్భధారణలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా చాలా మంది ఐవీఎఫ్ వంటి ఖరీదైన చికిత్సలపై ఆధారపడాల్సి వస్తోంది.
ఈ సమస్య ఒక్క రోజులో వచ్చినది కాదని నిపుణులు పేర్కొన్నారు. ఆహారంలో పోషకాల కొరత, జంక్ ఫుడ్స్ అధిక వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం వంటి అంశాలు కలిసి మగవారి సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే కొన్ని చిన్న మార్పులు, సహజమైన చిట్కాలను పాటిస్తే స్పెర్మ్ కౌంట్‌తో పాటు వాటి నాణ్యతను కూడా మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ఈ విషయంలో ఒక సులభమైన ఇంటి చిట్కాను సూచించారు. తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమె పంచుకున్న ఈ రెమిడీకి పెద్దగా ఖర్చు అవసరం లేదు. వంటగదిలో అందరికీ అందుబాటులో ఉండే వెల్లుల్లి, నెయ్యి ఉంటే చాలు. రోజూ ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను నెయ్యిలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి, వాటిని మెత్తగా చూర్ణంగా చేసి తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. ఈ చూర్ణాన్ని రోజూ తాజాగా తయారు చేసి, 15 రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని ఆమె చెబుతున్నారు.
ఈ చిట్కా వల్ల శుక్రకణాల సంఖ్య మాత్రమే కాదు.. వాటి కదలిక సామర్థ్యం, నాణ్యత కూడా మెరుగవుతుందని నిపుణుల అభిప్రాయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం రక్త ప్రసరణను మెరుగుపరచి, స్పెర్మ్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే సెలీనియం వంటి ఖనిజాలు శుక్రకణాల చలనశీలతను పెంచుతాయి. దీంతో సంతాన సామర్థ్యం మెరుగవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ రెమిడీ ఒక్కటే సరిపోదు. జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది ఏది పడితే అది తినే అలవాటుకు లోనవుతున్నారు. జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు శుక్రకణాల సంఖ్యను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వీటిని వీలైనంత వరకు నివారించాలి. బదులుగా నట్స్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, కాయధాన్యాలు, ఒమేగా థ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి.
వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్ పెరగడానికి దోహదం చేస్తుంది. శారీరక చురుకుదనం స్టామినాను పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
అధిక బరువు ఉన్నవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే బరువు నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అదే విధంగా ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా సంతాన సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.
నిద్ర కూడా కీలకం. రోజుకు కనీసం 7 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి అవసరం. సరైన నిద్ర హార్మోన్ల స్రవణాన్ని సమతుల్యం చేస్తుంది. దీని ప్రభావం స్పెర్మ్ ఉత్పత్తిపైనా పడుతుంది. అదేవిధంగా ఎక్కువసేపు వేడి నీటితో స్నానం చేయడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువసేపు పని చేయడం, ధూమపానం వంటి అలవాట్లు స్పెర్మ్ కౌంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని నివారిస్తే సహజంగానే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
NOTE: ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. క్రైమ్ మిర్రర్ ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు.
ALSO READ: Savings: సెకండ్ హ్యాండ్ EVతో ఇన్ని లాభాలా..!





