Speedy Justice: గంటల కొద్దీ వాదనలు, బండిళ్ల కొద్దీ పత్రాలతో నత్తనడకన సాగుతున్న కోర్టు విచారణ ప్రక్రియను పరిగెత్తించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నడుం కట్టారు. న్యాయవ్యవస్థలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు సమయాన్ని ఆదా చేసేందుకు, కేసుల విచారణను మరింత వేగవంతం చేసేందుకు కొత్త విధివిధానాలను(ఎ్‌సవోపీ) రూపొందించారు. సుదీర్ఘ వాదనలకు స్వస్తి చెప్పే దిశగా మంగళవారం సర్క్యులర్‌ను జారీ చేశారు.
సుప్రీం సర్క్యులర్ ఏం చెప్తుందంటే?
సుప్రీం తాజా సర్క్యులర్ ప్రకారం.. న్యాయవాదులు తాము కోర్టులో ఎంత సేపు మౌఖికంగా(ఓరల్) వాదించాలనుకుంటున్నారో విచారణకు ముందు రోజే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. వారికి ఇచ్చిన సమయం లోపలే తమ వాదనలను ముగించాల్సి ఉంటుంది. ఆ మేరకు వాదనలకు సమయాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
5 పేజీల్లో కేసు వివరాలు
కోర్టుకు సమర్పించే బండిళ్ల కొద్దీ పేపర్లలో కీలక విషయాలు మరుగునపడుతున్న నేపథ్యంలో వాదనల సమయంలో వాటిని జడ్జిలు వెతుక్కొనే పరిస్థితి కాకుండా కేసుకు సంబంధించితాము చెప్పబోయే కీలక వాదనలను న్యాయవాదులు ఐదు పేజీల్లో కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించాలి. అదీ విచారణకు మూడు రోజుల ముందు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ ద్వారా అందజేయాలి. అంతకుముందే ప్రత్యర్థి పక్షానికి ఒక కాపీని ఇవ్వాలి. తద్వారా వాదనలు కీలకమైన అంశాల చుట్టే తిరుగుతూ సమయం వృథా కాకుండా ఉంటుంది. న్యాయవాదులు ఎస్‌వోపీకి కచ్చితంగా కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు కోరింది. సత్వర న్యాయం అందించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.





