క్రైమ్

గంటల్లో ‘బస్టాండ్ బాలుడి’ కథ సుఖాంతం.. నల్లగొండ టూ టౌన్ సిబ్బందిపై ఎస్పీ పవార్ ప్రశంసలు!

  • ఎస్పీ దిశా నిర్దేశం.. పోలీసుల క్విక్ రియాక్షన్!

  • సీసీ కెమెరాల ఆధారంగా ప్రియుడితో బైక్ మీద వెళ్తున్న బాలుడి తల్లి గుర్తింపు

  • బైక్ నెంబర్ ఆధారంగా విచారణ మొదలు పెట్టిన పోలీసులు

  • బాలుడి తల్లితో పాటు ఆమె ప్రియుడు, భర్తను స్టేషన్ కు పిలిచిన పోలీసులు

  • కౌన్సిలింగ్ ఇచ్చిన బాబుని తండ్రికి అప్పగించిన పోలీసులు   

  • త్వరగా కేసును చేధించిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

క్రైమ్ మిర్రర్‌, నల్లగొండ బ్యూరో: పోలీసులు వేగంగా స్పందిస్తే.. ఎంత త్వరగా కేసులు పరిష్కారం అవుతాయో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహారణ నల్లగొండ బస్టాండ్ లో బాబును వదిలేసి వెళ్లిపోయిన తల్లి కథ. సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బంది అలర్ట్ కావడం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడం మొదలుపెట్టారు. సీసీ కెమెరాలు, బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేసి గంటల్లోనే బాబు తల్లితో పాటు ఆమె నడిపిన ప్రేమాయణాన్ని బయటపెట్టారు. బాబు తల్లితో పాటు ఆమె ప్రియుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అటు బాబు తండ్రిని కూడా స్టేషన్ కు పిలిపించారు. అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, బాబును తండ్రికి క్షేమంగా అప్పగించారు. భర్త మంచి మనసుతో భార్యను తీసుకెళ్లేందుకు ఇష్టపడటంతో ఆమెను అతడితో పంపించారు. కేసు శుభం కార్డు వేశారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని త్వరితగతిని క్లోజ్ చేసిన నల్లగొండ టూ టౌన్ ఎస్సై సైదులు టీమ్ కృషిని అభినందించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్లగొండ పోలీస్ సక్సెస్ ఫుల్ గా చేధించిన కేసులలో ఇదీ ఒకటన్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?   

ఈ నెల 26న నల్లగొండలో అమానుష ఘటన జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తన కొడుకును బస్టాండ్ లో వదిలేసి వెళ్లింది. అభం శుభం ఎరుగని ఆ బాలుడు ‘అమ్మా.. అమ్మా..’ అంటూ ఏడ్వటం చూసి ప్రయాణీకులు దగ్గరికి తీశారు. ఎవరో బాలుడు తప్పిపోయారని భావించి బస్టాండ్ సిబ్బందికి చెప్పారు. వారు వెంటనే నల్లగొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సైదులు  ఈ కేసును టేకప్ చేశారు. ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.  పూర్తిస్థాయి టెక్నాలజీని ఉపయోగించుకుని గంటల్లోనే కేసును క్లోజ్ చేశారు.

ఎస్సై సైదులు ఏం చెప్పారంటే?

సీసీ కెమెరాలు, బైక్ నెంబర్ ఆధారంగా ఈ కేసును త్వరగా చేధించినట్లు టూ టౌన్ ఎస్సై సైదులు తెలిపారు. “నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో.. ఓ మహిళ 15 నెలల కొడుకుని వదిలేసి.. వేరే యువకుడితో బైక్ మీద వెళ్లింది. పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో.. హైదరాబాద్ కు చెందిన నవీన అనే మహిళ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. సదరు మహిళకు పెళ్లి అయ్యింది. ఆమెకు ధనుష్ అనే 15 నెలల బాబు ఉన్నాడు. భర్త ఉండగానే మరో యువకుడితో ప్రేమలో పడింది. ఎలాగైనా భర్తను, బాలుడిని వదిలించుకుని ప్రియుడితో వెళ్లాలని ప్రయత్నించింది. ప్లాన్ ప్రకారమే.. హైదరాబాద్ నుంచి నల్లగొండ బస్టాండ్ కు బాబుతో వచ్చింది. బాబును బస్టాండ్ లోనే వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత.. ఆ పిల్లవాడు తల్లి కోసం వెతుకుతూ ఏడ్వడంతో ఆర్టీసీ సిబ్బంది మాకు సమాచారం అందించారు. మేం వెంటనే స్పందించి, బస్టాండ్ లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాం. బైక్ మీద వెళుతున్న మహిళను చూసి.. ఆ బాలుడు ‘మమ్మీ’ అంటూ గుర్తించాడు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేశాం. ఆ బైకును తన ఫ్రెండ్ తీసుకెళ్లినట్లు దాని యజమాని చెప్పాడు. బైక్ తీసుకెళ్లిన యువకుడి వివరాలు తెలుసుకుని, సదరు మహిళతో పాటు అతడిని స్టేషన్ కు రప్పించాం. విచారణలో వారి ఆన్ లైన్ ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. బాబు తండ్రికి సమాచారం అందించి స్టేషన్ కు పిలిపించాం. అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, బాబును అతడి తండ్రికి అప్పగించాం. సదరు మహిళకు కూడా నచ్చజెప్పి భర్తతో పంపించాం. భర్త కూడా ఆమెను మంచి మనసుతో తనతో తీసుకెళ్లేందుకు ఒప్పుకున్నాడు. ఆ మహిళతో పాటు సదరు ప్రేమికుడి ఇన్ స్టా అకౌంట్లను డిలీట్ చేయించాం. హ్యాపీ ఉండాలని చెప్పాం” అన్నారు.

టూ టౌన్ సిబ్బందిపై ఎస్పీ పవార్ ప్రశంసలు

ఈ కేసును గంటల వ్యవధిలో చేధించిన నల్లగొండ టూ టౌన్ ఎస్సై సైదులుతో పాటు స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. “ బస్టాండ్ బాలుడి కేసును నల్లగొండ టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బాబును క్షేమంగా తండ్రి దగ్గరికి చేర్చడం శుభ పరిణామం. పోలీసులు నచ్చజెప్పి భార్య భర్తలను కలిపి పంపించి ఓ కుటుంబాన్ని నిలబెట్టారు. ఈ కేసు చేధించిన టూ టౌన్ ఎస్సై సైదులుతో పాటు స్టేషన్ సిబ్బందిని అభినందిస్తున్నాను. ఇలాంటి కేసుల విషయంలో జిల్లా పోలీసులు అంతా నల్లగొండ టూ టౌన్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలి” అని ఎస్పీ పవార్ అన్నారు. అటు జిల్లా ప్రజలు కూడా ఈ కేసు విషయంలో పోలీసుల పనితీరును అభినందిస్తున్నారు. అన్ని కేసులను ఇలాగే పరిష్కరించాలని కోరుతున్నారు.

Read Also: మానవత్వానికి మాయని మచ్చ: ప్రియుడి కోసం కన్న కొడుకును బస్టాండ్‌లో వదిలేసిన తల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button