
Railway Alert: రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. పలు చోట్ల పట్టాల మీదికి వరద నీరు వచ్చి చేరున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో పలు చోట్ల పట్టాల మీదికి వరద నీరు వచ్చి చేరుతోంది. పిడుగురాళ్ల-బెల్లంకొండ మధ్య బ్రిడ్జి నంబర్-59 దగ్గర వరద నీరు ప్రమాద హెచ్చరిక మార్క్ కు చేరుకుంది. అటు గుంటూరు- తెనాలి మధ్య వంతెన నంబర్-14 దగ్గర, వెజెండ్ల-మణిపురం మధ్య బ్రిడ్జి నంబర్-14 దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని లోకో పైలెట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రైళ్ల వేగం 30 కి.మీకి మించొద్దు!
ఈ ప్రదేశాల్లో 30 కి.మీ./గం. వేగంతో మాత్రమే రైళ్లను నడిపించాలంటూ రైల్వేశాఖ లోకో పైలెట్లకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ సమయంలో ఎవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. రైల్వే సిబ్బంది కూడా ట్రాక్ ల వెంట, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది. రైళ్ల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అటు వరద నీరు తగ్గిన తర్వాత మళ్లీ సాధారణ వేగం ప్రారంభమవుతుందని రైల్వేశాఖ వెల్లడించింది.
Read also: శంషాబాద్ లో ప్రతికూల వాతావరణం, విమానాల దారి మళ్లింపు!