
ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన కల్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి అజయ్‌షా నోరు జారి… తర్వాత నాలుక కరుచుకున్నారు. పేరు ప్రస్తావించకుండానే పాకిస్థానీలు, ఉగ్రవాదుల సోదరి…అంటూ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపిన వారి అంతు చూసేందుకు ప్రధాని మోదీ వారి సోదరిలో ఒకరిని పంపారంటూ వ్యాఖ్యలు చేశారు.
మీరు మా ఆడబిడ్డలను విధవరాళ్లను చేస్తే మీ సమాజానికి చెందిన మీ సోదరిని పంపి మీకు గుణపాఠం చెప్పారంటూ మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి అజయ్ షా వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దేశం కోసం పోరాడిన ముస్లిం మహిళ .. ఉగ్రవాదులు, పాకిస్థానీలకు సోదరి ఎలా అవుతుందంటూ పలువురు తీవ్రంగా ప్రశ్నించారు. దాంతో మంత్రి మాట మార్చారు. పది సార్లు సారీ చేప్పేందుకు సిద్ధమన్నారు. తన సోదరి కంటే సోఫియా ఖురేషీనే ఎక్కువ గౌరవిస్తానంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు భద్రతను పెంచారు. ఆయన భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జత చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతా చర్యలు కూడా కఠినతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జైశంకర్‌కు ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలతో Z-కేటగిరీ భద్రత కొనసాగుతుంది. 24 గంటలూ ఆయనకు రక్షణగా సుమారు 33 మంది కమాండోల బృందం రక్షణగా ఉంటుంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా సహా సుమారు 25 మంది బీజేపీ నాయకులకు అదనపు భద్రత కల్పించినట్లు పోలీసులు తెలిపారు.